
తాజా వార్తలు
93.7శాతానికి చేరిన రికవరీ రేటు
24 గంటల్లో కొత్తగా 46,232 కేసులు..564 మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇటీవల వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా..కేసుల్లో మరోసారి భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 46,232 కొత్త కేసులు వెలుగుచూడగా, మొత్తం కేసులు 90,50,597కి చేరుకున్నాయి. అయితే, క్రియాశీల కేసుల్లో తగ్గుదల, కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కాస్త ఊరటకలిగిస్తోంది. క్రియాశీల కేసుల సంఖ్య 4,39,747గా ఉండగా..ఆ రేటు 4.86శాతానికి తగ్గింది. అలాగే, ఇప్పటివరకు వైరస్ నుంచి 84,78,124(93.67శాతం) మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. అయితే మరణాల సంఖ్యలో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 564మంది మరణించగా..ఇప్పటివరకు 1,32,726 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. కాగా, నిన్న 10,66,022 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా 5.7కోట్లు దాటిన కేసులు:
జాన్స్హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా 5,74,41,503 కరోనా కేసులు నమోదు కాగా, 13,71,241మరణాలు సంభవించాయి.అయితే, కోలుకున్న వారి సంఖ్య నాలుగు కోట్ల మార్కును దాటేసింది. కాగా, అగ్రదేశం అమెరికా కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. ఆ దేశంలో 1,19,08,395 మంది వైరస్ బారిన పడగా, 2,54,383 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.