ఒక్కరోజే కరోనాకు 459 మంది బలి
close

తాజా వార్తలు

Updated : 01/04/2021 11:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కరోజే కరోనాకు 459 మంది బలి

72,330 కొత్త కేసులు

మహారాష్ట్రను పీడిస్తోన్న మహమ్మారి

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ భారీ సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 459 మంది బలికావడం పరిస్థితి తీవ్రతను అద్దంపడుతోంది. బుధవారం 11,25,681 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..72,330 మందికి పాజిటివ్‌గా తేలింది. అక్టోబర్ ప్రారంభంలో ఈ స్థాయి విజృంభణ కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,22,21,665కి చేరగా.. 1,62,927 మంది ప్రాణాలు కోల్పోయారని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

రోజురోజుకూ క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 5,84,055 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 4.55 శాతానికి చేరింది. నిన్న 40,382 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1.14కోట్ల పైచిలుకు మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోగా..రికవరీ రేటు 94.11 శాతంగా ఉంది. 

మహమ్మారి గుప్పిట్లో మహారాష్ట్ర..
ఆదివారం, హోలీ సెలవుల కారణంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గడంతో కొత్త కేసులు తగ్గినట్లు కనిపించాయి. కానీ, మళ్లీ ఇప్పుడు కరోనా అసలు తీవ్రత కనిపిస్తోంది. మహమ్మారితో అతలాకుతలం అవుతోన్న మహారాష్ట్రలో.. తాజాగా 39,544 కొత్త కేసులు వెలుగుచూశాయి. 227 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన మరణాల్లో.. సుమారు సగం మరణాలు ఈ ఒక్క రాష్ట్రంలోనే వెలుగుచూడటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు 28,12,980 మందికి కరోనా సోకగా..24,00,727 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య 3,57,604గా ఉంది. ఆ రాష్ట్రంలో కొవిడ్ కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ గురించి యోచిస్తున్నప్పటికీ.. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజల నుంచి మాత్రం వ్యతిరేకత వ్యక్తం అవుతోన్న సంగతి తెలిసిందే.

మరోవైపు, ఇప్పటికే రెండు దశల్లో భాగంగా నడుస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు అందిస్తున్నారు. నిన్న 20,63,543 మందికి కేంద్రం టీకా డోసులను పంపిణీ చేసింది. మార్చి 31 నాటికి 6,51,17,896 మందికి టీకాలు అందాయని తెలిపింది. 
 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని