
తాజా వార్తలు
కరోనా నుంచి కుదుటపడుతున్న భారత్!
ఓవైపు రికవరీలు.. మరోవైపు టీకాలు!
దిల్లీ: కరోనా మహమ్మారి నుంచి భారత్ క్రమంగా కుదుటపడుతోంది. గత 24 గంటల్లో 5,48,168 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,788 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773కి చేరింది. ఆదివారం వెల్లడించిన వివరాలతో పోలిస్తే నేడు 9శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే, నిర్ధారణ పరీక్షలు సైతం భారీగా తగ్గడం గమనార్హం. ఇక కొత్తగా 14,457 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 1,02,11,342కు చేరింది. దీంతో రికవరీ రేటు 96.59 శాతానికి పెరిగింది.
మరోవైపు, గడిచిన 24 గంటల్లో 145 మంది మరణించారు. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,52,419కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,08,012కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఇంతవరకు 2,24,301 మందికి కరోనా టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 447 మందికి స్వల్పస్థాయి ఇబ్బందులు వచ్చాయని ఈ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నానీ తెలిపారు. ముగ్గురిని మాత్రమే ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని, వారిలో ఇద్దరిని డిశ్ఛార్జి చేయగా మూడో వ్యక్తి రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో వైద్యుల పరిశీలనలో ఉన్నారని తెలిపారు. ఓవైపు టీకా కార్యక్రమం శరవేగంగా కొనసాగుతుండడం.. మరోవైపు రికవరీల సంఖ్య పెరుగుతుండడం ఊరట కలిగిస్తోంది.
ఇవీ చదవండి..