రూ.5.5లక్షల కోట్లతో భారీ ఉద్దీపన అవసరం!
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 19:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.5.5లక్షల కోట్లతో భారీ ఉద్దీపన అవసరం!

అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ నివేదిక

దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత ఆర్థిక ప్రతిస్పందన నామమాత్రంగానే ఉందని తాజా నివేదిక వెల్లడించింది. ఈ సంక్షోభాన్ని పూర్తిస్థాయిలో ఎదుర్కోవాలంటే రూ.5.5లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అవసరమని సూచించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2021: వన్‌ ఇయర్‌ ఆఫ్‌ కొవిడ్‌-19’ పేరుతో అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ రూపొందించిన నివేదిక అభిప్రాయపడింది.

ప్రస్తుతం కొనసాగుతోన్న సెకండ్‌ వేవ్‌ వల్ల కలిగే ప్రభావం తొలి వేవ్‌ కంటే సుదీర్ఘకాలం పాటు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తాజా నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా పని, ఆదాయాలు, ఆహార భద్రత, ఆరోగ్యంతో పాటు విద్యపై తీవ్ర ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. వైరస్‌ కట్టడికి కఠిన ఆంక్షలు, సంక్షేమ విధానాలతో కరోనా ఉద్ధృతిని నియంత్రించడంలో ముందున్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతినే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది. ఇలాంటి సమయంలో కేంద్రం మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది.

* రెండు నెలలపాటు పేదలకు ఉచితంగా రేషన్‌ ఇస్తామని కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను 2021 చివరి నాటికి కొనసాగించాలి

* ప్రస్తుత పరిస్థితులతో తీవ్రంగా నష్టపోతున్న కుటుంబాలను గుర్తించి, వారిని ఆదుకునేందుకు వారికి మూడు నెలలపాటు రూ.5000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలి

* కేవలం జన్‌ధన్‌ ఖాతాలు ఉన్నవారికే కాకుండా డిజిటల్‌ విధానంలో పేదలందరికీ ఆర్థిక సాయం అందివ్వాలి

* మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఏ-నరేగా)ను 150 రోజులకు పొగడించాలి. ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్‌ను రూ.1.75 లక్షల కోట్లకు పెంచాలి

* పట్టణ పేదలను దృష్టిలో ఉంచుకొని తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పైలట్‌ ప్రాతిపదికన అర్బన్‌ ఎంప్లాయిమెంట్‌ ప్రోగ్రాంను ప్రారంభించాలి. వీటిలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలి

* కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్‌ను సహాయాన్ని రూ.500లకు పెంచాలి

* కొవిడ్‌ పోరులో ముందువరుసలో ఉన్న అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు నెలకు రూ.5వేల చొప్పున ఆరు నెలలపాటు(రూ.30వేలు) భత్యాన్ని అందించాలి. దీనివల్ల దేశవ్యాప్తంగా 25లక్షల మంది లబ్ధిపొందుతారు.

ఇలాంటి చర్యలను తీసుకున్నట్లయితే కేంద్రానికి మొత్తం దాదాపు రూ.5.5లక్షల కోట్ల అదనపు ఖర్చు అవుతుందని తాజా నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ప్రస్తుతం ఇలాంటి చర్యలు తీసుకోవడంలో విఫలమైతే స్వల్పకాలిక నష్టాలను కొనసాగించడంతో పాటు గతకొన్నేళ్లుగా సంక్షేమ పథకాల ద్వారా సాధించిన ప్రగతిని కోల్పోవాల్సి వస్తుందని అభిప్రాయపడింది. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు పోషకాహారం, విద్య వంటి అంశాలు దీర్ఘకాలిక ప్రభావాలను కలిగిస్తాయని పేర్కొంది.

దేశంలో గత ఏడాది నుంచి ఉద్యోగాలు, ఆదాయం, అసమానతలు, పేదరికంపై కరోనా మహమ్మారి చూపిన ప్రభావాన్ని అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ నివేదించింది. చాలా పేద కుటుంబాలు ఆహారాన్ని తగ్గించి తినడం, రుణాలు తీసుకోవడం, ఆస్తులను అమ్ముకునే పరిస్థితిని ఎదుర్కొన్నాయని నివేదిక వెల్లడించింది. అయితే, ఇలాంటి తీవ్రమైన బాధలను నివారించడంలో ఇప్పటివరకు ప్రభుత్వం అందించిన సహాయం కొంత ఉపశమనం కలిగించిందని పేర్కొంది. వీటిని ఇక్కడితో ఆపకుండా సాహసపోతేమైన నిర్ణయాలతో మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని