
తాజా వార్తలు
మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
మదనపల్లె: చిత్తూరు జిల్లాలో ఇద్దరు కూతుళ్లను మంత్రాల పేరుతో ఆదివారం రాత్రి తల్లి హత్య చేసిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట హత్యల ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో ఒకరైన సాయిదివ్య(22) మూడు రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలింది. ‘శివ ఈజ్ కమ్.. వర్క్ ఈజ్ డన్’ అంటూ యువతి పోస్టులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చి తరచూ ఘటన జరిగిన ఇంట్లో పూజలు చేసేవారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే మృతుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంట్లోనే ఉంచి విచారణ చేపడుతున్నారు. నివాసంలో దేవుళ్లతో పాటు చిత్రవిచిత్రంగా ఉన్న ఫొటోలను పోలీసులు గమనించారు. నిందితులకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం వైద్యుల సలహాతోనే వారిని అరెస్టు చేస్తామని వారు చెబుతున్నారు. ఘటనకు గల ఆధారాలు సేకరించేందుకు ఇవాళ ఉదయం క్లూస్ టీం చిత్తూరు నుంచి మదనపల్లె బయల్దేరింది. మరోవైపు మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..
చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌కు చెందిన ఎన్.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) పిల్లలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె బోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్నకుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. వీరంతా గత ఏడాది ఆగస్టులో శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు దిలీప్‌కుమార్, రమాదేవి సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇవీ చదవండి..
కనిపెంచిన చేతులే.. కాటేశాయి
యూట్యూబ్ నటితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
ఉగ్రవాదుల చేతుల్లో కొత్త మెసేజింగ్ యాప్‌లు!