
తాజా వార్తలు
సంజయ్‌ను చూసి సర్ప్రైజ్ అయ్యా: కంగన
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను నటి కంగనా రనౌత్ కలిశారు. వృత్తిపరమైన పనుల కోసం హైదరాబాద్ వచ్చిన వీరు ఒకే హోటల్లో బసకు దిగారు. ఈ నేపథ్యంలో సంజును కలిసి, కాసేపు ముచ్చటించినట్లు కంగన ట్వీట్ చేశారు. ‘సంజు, నేను ఒకే హోటల్లో ఉన్నామని తెలిసిన తర్వాత ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి ఇవాళ ఉదయం వెళ్లాను. ఆయన్ను చూసి చాలా సర్ప్రైజ్ అయ్యా. సంజు గతంలో కంటే ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్గా, ఆరోగ్యంగా ఉన్నారు. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మేమంతా ప్రార్థిస్తున్నాం సంజయ్ సర్’ అని పేర్కొన్నారు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి ఉందని, మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని.. కంగన అనేకమార్లు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. అలాంటి ఆమె సంజయ్‌ను కలవడం, ఆయనతో ఫొటో దిగడంపై కొందరు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. కెరీర్ ఆరంభంలో సంజయ్ మాదక ద్రవ్యాలకు బానిసై సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల తాను ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించి, అందర్నీ షాక్‌కు గురి చేశారు. ముంబయిలోని కోకిలబెన్ ఆసుపత్రిలో కొన్ని నెలలపాటు చికిత్స తీసుకున్న సంజయ్ క్యాన్సర్‌ను జయించారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండటంతో షూటింగ్లలో పాల్గొంటున్నారు.