close

తాజా వార్తలు

Updated : 09/04/2021 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రైవేటు‌ పాఠశాలల సిబ్బందికి కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి శుభవార్త చెప్పారు.  రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించే వరకు అర్హులైన వారికి నెలకు రూ.2వేల ఆపత్కాల ఆర్థిక సాయం, రేషన్‌ దుకాణాల ద్వారా 25కిలోల బియ్యం అందివ్వాలని సీఎం నిర్ణయించారు. గుర్తింపు పొందిన ప్రైవేటు‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంక్‌ అకౌంట్‌, వివరాలతో జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వం అందించే సాయంపై విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసుకుని విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రైవేటు‌ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1.45లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. 

రేపు మంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌

ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి ఆపత్కాల సాయంపై శుక్రవారం ఉదయం  బీఆర్కే భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మను కేసీఆర్‌ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు డీఈవోలు, పౌరసరఫరాల శాఖ డీఎస్‌వోలు పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం సాయానికి సంబంధించిన విధివిధానాలు, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేయనున్నారు.

 



ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని