
తాజా వార్తలు
ఫోన్ ఛార్జింగ్..మీరూ ఈ తప్పులు చేస్తున్నారా..?
ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఫోన్ కొనేప్పుడు ఎక్కువ మంది పరిశీలించేది ఫోన్ బ్యాటరీ..దాని ఛార్జింగ్ సామర్థ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతటి పనైనా స్మార్ట్‌ఫోన్ సాయంతో తక్కువ వ్యవధిలో కానిచేస్తున్నారు. అందుకే ఫోన్ ఎక్కువసేపు పనిచేసేందుకు అవసరమైన బ్యాటరీ గురించి ఎక్కువ ఆరా తీస్తుంటారు. మరి అంత ముఖ్యమైన ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేసేప్పుడు ఎన్నో రకాల సందేహాలు..దానికి తోడు అప్పుడప్పుడు ఫోన్ ఛార్జింగ్ చేస్తుంటే బ్యాటరీ పేలిపోయిందనే వార్తలు వింటుంటాం. అసలు ఫోన్ బ్యాటరీ ఎందుకు పేలుతుంది..?ఛార్జింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది..?ఫోన్ ఛార్జింగ్‌కు ఎలాంటి ఛార్జర్లు వాడాలి..?వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కింది సమాచారం..మరింకెందుకు ఆలస్యం అవేంటో మీరు ఓ లుక్కేయండి..
* ముందుగా చాలా మందిలో ఉండే సందేహం ఫోన్ రాత్రంతా ఛార్జింగ్ చేయడం మంచిదా..కాదా..? దీనికి సమాధానం మంచిదే. అవునండీ.. ఫోన్ రాత్రంతా ఛార్జింగ్ పెట్టినా ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే..బ్యాటరీ వంద శాతం ఛార్జ్ అయిన తర్వాత ఛార్జింగ్ అవటం దానంతట అదే ఆగిపోతుంది. ప్రస్తుతం తయారవుతున్న ఫోన్లలో బ్యాటరీలు సామర్థ్యానికి మించి ఛార్జ్ కాకుండా ఉండేలా ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దాని వల్ల ఫోన్ ఓవర్ ఛార్జ్ కాదన్నమాట.
* ఒక వేళ మీరు రాత్రి పడుకునేప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి రాత్రంతా అలా వదిలేయాలనుకుంటే ఫోన్ కేస్‌లోంచి ఫోన్‌ని బయటికి తీసి ఛార్జింగ్ పెట్టడం మంచిది. అలానే ఫోన్‌ని ఛార్జింగ్‌కి పెట్టినప్పుడు దానిపై ఎలాంటి వస్తువులు ఉండకుండా చూసుకోండి. అంటే దిండు కింద, పుస్తకాల కింద, మంచం పక్కనున్న డ్రాలో పెట్టడం చేయకండి. దాని వల్ల ఫోన్ వేడెక్కి బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.
* మరో ముఖ్యమైన విషయం..మీరు ఫోన్ ఛార్జ్ చేసేందుకు ఉపయోగించేది కంపెనీ ఛార్జర్ అయిండాలి. ఒక వేళ నకిలీ ఛార్జర్ ఉపయోగిస్తే ఫోన్ లేదా ఛార్జర్ కాలిపోయే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఫోన్ ఛార్జ్ చేసేందుకు కంపెనీ ఇచ్చిన ఛార్జర్‌నే ఉపయోగించాలి. అయితే ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఇస్తున్నాయి. ఛార్జింగ్ అడాప్టర్‌ని ఇవ్వడం లేదు. అలాంటప్పుడు కంపెనీ తయారుచేసిన యూఎస్బీ అడాప్టర్‌ని కొనుగోలు చేసి ఉపయోగించడం మేలు. ఎందుకంటే కంపెనీ ఇచ్చే ఛార్జర్లను అనేక రకాలుగా పరీక్షించి ఆమోదముద్ర వేస్తారు కాబట్టి వాటితో ఎలాంటి ప్రమాదం ఉండదు.
* తప్పని పరిస్థితుల్లో డూపికేట్ ఛార్జర్లు ఉపయోగించాల్సి వస్తే..వాటితో ఫోన్‌ని పూర్తిగా అంటే వంద శాతం ఛార్జ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే బ్యాటరీ చివరి 20 శాతం ఛార్జ్ అయ్యేప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆ సమయంలో అది పేలిపోయే ప్రమాదం ఉంది. అలానే నకిలీ ఛార్జర్లు బ్యాటరీ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
* అలానే మనలో చాలా మంది ఫోన్ బ్యాటరీ పూర్తిగా జీరో అయిన తర్వాత ఛార్జ్ చేయడం మంచిదని నమ్ముతుంటారు. కానీ అలా చేయడం ఏ మాత్రం మంచిది కాదు. బ్యాటరీ ఛార్జింగ్ 20 నుంచి 30 శాతం మధ్య ఉన్నప్పుడే ఛార్జ్ చేయడం మంచిది. అంతకన్నా తక్కువ అయిన తర్వాత ఛార్జ్ చేస్తే అది బ్యాటరీ జీవితకాలంపై ప్రభావం చూపిస్తుంది.
* అదే మీ ఫోన్లో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటే మీరు ఛార్జింగ్ 20 శాతానికి వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే తక్కువ సమయం ఎక్కువ సార్లు ఛార్జ్ చేసుకున్నా సరిపోతుంది. ఉదాహరణకు బ్యాటరీ 5 శాతం నుంచి 10 శాతం వరకు ఛార్జ్ చేసి..కొంతసేపు వాడుకుని 10 నుంచి 30 శాతం వరకు అలా..మీ అవసరాన్ని బట్టి కూడా ఛార్జ్ చెయ్యొచ్చు. ప్రస్తుతం కొత్తగా వస్తున్న ఫోన్లలో ఉన్న బ్యాటరీలకు ఒకే సారి ఎక్కువ ఛార్జ్ చేసే కంటే..తక్కువ సమయం ఎక్కువ సార్లు ఛార్జ్ చేయడం మేలంటున్నారు టెక్ నిపుణులు.
పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తే..మీ ఫోన్ బ్యాటరీ పనితీరు మెరుగవటమే కాకుండా..బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి..
మోసపోవద్దంటే.. ఇలా చేయాల్సిందే