
తాజా వార్తలు
అలాగైతే రాజధాని కడప తరలుండేది: నాని
అమరావతి: ఓ కులంపై ద్వేషంతోనే రాజధానిని తరలిస్తున్నామని తెదేపా నేతలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. అదే నిజమైతే రాజధానిని జగన్ ఏ కడపో, కర్నూలో తరలుండేదని మంత్రి కొడాలి నాని అన్నారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వంలా మేం ప్రజలకు భ్రమలు కల్పించలేదు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందని చంద్రబాబు అంటున్నారు. రాజధాని ఎక్కడ పెడితే రాష్ట్రాభివృద్ధికి ఉపయోగమో చూడాలి. దిల్లీ.. దేశానికి ఏమైనా మధ్యలో ఉందా? అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు అమరావతిని పాడు పెట్టేశారు. ఇది చంద్రబాబు అమరావతి.
కులంపై ద్వేషంతో రాజధానిని తరలిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. రాజధాని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. విశాఖలో కూడా ఆ కులం వారికే అధిక వ్యాపారాలు ఉన్నాయి. ఒక కులం మీద జగన్కు ప్రేమే ఉంటే రాజధాని కడపో, కర్నూలో, నెల్లూరో వెళ్లి ఉండేది. ఈ రెండు జిల్లాల ప్రజా ప్రతినిధులు జగన్ను బెదిరించాలని చంద్రబాబు అంటున్నారు. ఆయన ఏమైనా చంద్రబాబా? బెదిరిపోవడానికి. ప్రజలేమీ అమాయకులు కారు. రెచ్చగొడితే రెచ్చిపోరు. ఒకవేళ అమాయకులే అయ్యి ఉంటే తెదేపాకు వచ్చిన 23 సీట్లు.. వైకాపాకు వచ్చేవి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. ప్రభుత్వం పెట్టుబడి పెట్టకుండా నగరాలు నిర్మించడం సాధ్యమవుతుందా? తెదేపాకు 23 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో ఇద్దరు దూరమయ్యారు. చంద్రబాబు కాకుండా మిగిలింది 20 మందే. చంద్రబాబు విజన్ 2020 అంటే ఇదేనేమో!’’ అని నాని ఎద్దేవాచేశారు. ‘‘మమ్మల్ని రాజీనామా చేయాలని అంటున్నారు. పార్టీ పెట్టినప్పుడు జగన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అమరావతిలో రాజధాని ఉండాలని ప్రజలు భావిస్తున్నారని మీకు నమ్మకముంటే మీ 21 మంది ఎమ్మెల్యేలూ రాజీనామా చేయండి’’ అని సవాల్ విసిరారు.