
తాజా వార్తలు
తప్పిదాలకు కేసీఆర్‌దే బాధ్యత: కోదండరామ్
హైదరాబాద్: కరోనా బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెజస అధ్యక్షుడు కోదండరామ్ ఒక రోజు దీక్ష చేపట్టారు. దీక్షకు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ... ప్రతి పేద కుటుంబానికి రూ.7,500 ఆర్థిక సాయం చేయాలని కోరారు. సీఎం సహాయనిధికి ఎన్ని నిధులు వచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపైనా స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని తప్పిదాలకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని, మొత్తం వనరులను కొవిడ్ నిర్మూలనకు ఖర్చు చేయాలన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఎన్ని సార్లు కోరినా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. కరోనా సోకిన అందరికీ గాంధీలోనే చికిత్స అందిస్తామని చెప్పి.. తెరాస ఎమ్మెల్యేలకు మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారని విమర్శించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు భరోసా కల్పించాలని కోరారు.
చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... వెంటనే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి పేదలను ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని, కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.