
తాజా వార్తలు
ముగ్గురు ఎమ్మెల్యేల పద్ధతి మారాలి: కేటీఆర్
హైదరాబాద్: విభేదాలు వీడి పార్టీ గెలుపు కోసం నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాస నేతలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని.. వారు పద్ధతి మార్చుకోవాలని పరోక్షంగా వారిని కేటీఆర్ హెచ్చరించారు. ఖమ్మం కార్పొరేషన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో ప్రగతిభవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్, పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస గెలిచి తీరాలని.. ఆ దిశగా పార్టీ నేతలు పనిచేయాలన్నారు. ఏ ఎన్నికనూ ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. పార్టీలోని పాత, కొత్త నేతలు కలిసి బాధ్యతలు పంచుకోవాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్టవ్యాప్తంగా 2014, 2018 ఎన్నికల్లో తెరాస అద్భుత ఫలితాలు సాధించినప్పటికీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తి నిరాశాజనకమైన పరిస్థితులు కనిపించాయన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలూ గెలవాలని.. దీనికోసం ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని నేతలకు సూచించారు. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోందని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలన్నారు.
ఇవీ చదవండి..
నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: ఆరుగురి మృతి
TS: ఈడబ్ల్యూఎస్ కోటాపై కీలక నిర్ణయం