
తాజా వార్తలు
‘కరోడ్పత్నీస్’.. ఈ సారి వాళ్లదే హవా!
కేబీసీలో చరిత్ర సృష్టించిన అతివలు
మేనేజర్ నజియా నజీమ్.. ఐపీఎస్ అధికారి మోహితా శర్మ.. టీచర్ అనుపా దాస్.. డాక్టర్ నేహా షా.. వృత్తిపరంగా వేర్వేరు రంగాలకు చెందిన మహిళలు వీరు. కానీ, వీరి మధ్య ఓ సారూప్యత ఉంది. వీరంతా ఇప్పుడు కోటీశ్వరులు. సామాన్యులను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి ఆశలు, కలలను సాకారం చేస్తున్న ప్రముఖ టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ లో ఈ నలుగురూ చరిత్ర సృష్టించారు. ‘‘మహిళలు ఎవరికీ తీసిపోరు’’ అని చాటిచెప్పుతూ తమ ప్రతిభ, అదృష్టంతో ఒకే సీజన్లో వీరంతా కోటి రూపాయలు గెలుచుకున్నారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)’ సీజన్ 12 తుది దశకు చేరుకుంది. శుక్రవారం రాత్రి ఈ సీజన్ చివరి ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే 12వ సీజన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు నలుగురు రూ. కోటి గెలుచుకోగా.. వారంతా మహిళలే కావడం విశేషం. వృత్తిపరంగా వేర్వేరు రంగాల్లో పనిచేస్తున్న ఈ నలుగురూ.. కేబీసీలో అత్యుత్తమ ప్రదర్శన చేశారు. క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కోటీశ్వరులయ్యారు. తమ కలలను సాకారం చేసుకుని మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలిచారు. కేబీసీ గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఈ ‘లేడీ కరోడ్పత్నీస్’ గురించి ఓ సారి చూద్దాం..
తల్లి ప్రోత్సాహంతో..
దిల్లీకి చెందిన నజియా నసీమ్.. ఈ సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తి. మాస్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నజియా ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో కమ్యూనికేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది నవంబరు 11న కేబీసీలో పాల్గొని అత్యుత్తమంగా ఆడారు. నజియా తల్లి కేబీసీ షో, అమితాబ్‌బచ్చన్‌కు పెద్ద అభిమాని అట. తల్లి ప్రోత్సాహంతోనే ఈ షోలో పాల్గొన్న ఆమె.. కోటి గెలుచుకుని బిగ్‌బీ ప్రశంసలు అందుకున్నారు. తనకొచ్చిన నగదు బహుమతిని తల్లిదండ్రులు, అత్తామామల వైద్యానికి, కొడుకు చదువులకు, ఛారిటీకి ఉపయోగిస్తానని ఆనందంగా చెప్పారు నజియా.
భర్త కలను నిజం చేసిన మోహిత..
ఈ సీజన్లో కోటి గెలుచుకున్న రెండో మహిళ ఐపీఎస్ అధికారి మోహితా శర్మ. హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రా ప్రాంతానికి చెందిన మోహిత.. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త రూషల్ గార్గ్ ఐఎఫ్ఎస్ అధికారి. రూషల్కు కేబీసీ షో అంటే చాలా ఇష్టం. గత 20ఏళ్లుగా ఈ షోలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. అయితే ఎప్పుడూ అర్హత సాధించలేకపోయారు. దీంతో భర్త కలను నిజం చేసేందుకు మోహిత కేబీసీకి రిజస్టర్ చేసుకున్నారు. అదృష్టవశాత్తూ ఆడిషన్స్‌లో ఎంపికై.. షోలో పాల్గొన్నారు. సివిల్స్ ప్రిపేర్ అయ్యేప్పుడే అన్ని సబ్జెక్టుల మీద అవగాహన పెంచుకోవడంతో షోలో అన్ని ప్రశ్నలకు చకచకా సమాధానం చెప్పారు. నవంబరు 17న ప్రసారమైన ఎపిసోడ్లో ఆమె కోటి రూపాయలు గెలుచుకుని భర్త కలను నెరవేర్చారు.
టీచరమ్మ.. 20ఏళ్ల ప్రయత్నం
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అనుపా దాస్ ఈ సీజన్లో మూడో కోటీశ్వరురాలు. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతమైన బస్తర్ జిల్లాకు చెందిన అనుపాదాస్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ షోలో పాల్గొనేందుకు 20ఏళ్లు పాటు ప్రయత్నించి.. చివరకు 12వ సీజన్లో అవకాశం దక్కించుకున్నారు. గేమ్‌లో అద్భుతంగా ఆడి నవంబరు 25న కోటి గెలుచుకున్నారు. ఆమె ప్రదర్శనకు బిగ్‌బీ కూడా ప్రశంసలు కురిపించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి చికిత్స కోసం ఈ డబ్బును ఉపయోగిస్తానని ఆమె చెప్పారు.
పేదలకు వైద్య చికిత్స అందించాలని..
ఈ ఏడాది జనవరి 7న ప్రసారమైన షోలో డాక్టర్ నేహా షా కోటి రూపాయిలు గెలుచుకుని నాలుగో కోటీశ్వరురాలిగా రికార్డు సాధించారు. ముంబయికి చెందిన నేహ కూడా 20ఏళ్ల పాటు హాట్ సీట్లో కూర్చుకోవాలని ప్రయత్నించారు. ఎట్టకేలకు ఈ ఏడాది ఆమె కోరిక నిజమైంది. వృత్తిపరంగా వైద్యురాలైన నేహా.. కరోనా మహమ్మారి, లాక్డౌన్ సమయంలో ఎంతోమంది కొవిడ్ రోగులకు చికిత్స అందించారు. తాను గెలుచుకున్న డబ్బుతో సొంతంగా హాస్పిటల్ ఏర్పాటు చేసి పేద, అణగారిన వర్గాల ప్రజలకు వైద్య చికిత్స అందించాలనుకుంటున్నట్లు నేహా చెప్పుకొచ్చారు.
కార్గిల్ హీరోలకు.. ఫినాలే అంకింతం
నిజానికి గతేడాది మే లోనే ఈ షో ప్రసారం కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా సెప్టెంబరు 28న మొదలైంది. వైరస్ దృష్ట్యా ఈసారి ఆడియన్స్ లేకుండానే షోను నిర్వహించారు. చివరి ఎపిసోడ్‌ను కార్గిల్ యుద్ధ వీరులుగా అంకితం చేయనున్నారు. ఇందుకోసం పరమవీర చక్ర అవార్డు గ్రహీతలు సుబేదార్ సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్‌ను ఆహ్వానించారు. ఫైనల్ ఎపిసోడ్లో వీరిద్దరూ హాట్సీట్లో కూర్చోనున్నారు.