
తాజా వార్తలు
నా భర్త అందరికీ ప్రేరణ: సంతోష్ సతీమణి
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కొవిడ్ నేపథ్యంలో గణతంత్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. చైనా సైనికుల దాడిని వీరోచితంగా తిప్పికొడుతూ అమరుడైన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు సతీమణి సంతోషిని ఈ సందర్భంగా కలెక్టర్ సన్మానించారు. గత ఏడాది వీరమరణం పొందిన సంతోష్‌బాబు సేవలను స్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం మహావీర్‌చక్ర పురష్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి, శిక్షణా కలెక్టర్ సంతోషిని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా సంతోషి మాట్లాడుతూ.. కేంద్రం తన భర్త సంతోష్‌బాబుకు అవార్డు ప్రకటించటం పట్ల గర్వంగా ఉందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన భర్త అందరికీ ప్రేరణగా ఉంటారన్నారు. తన పిల్లలు వారి నాన్నను చూసి గర్విస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో సంతోషి భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నల్ సంతోష్‌బాబు కుటుంబసభ్యులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. సంతోష్‌బాబు సతీమణి సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ సహా కుటుంబసభ్యులను రాజభవన్లో గవర్నర్ సత్కరించారు. సంతోష్‌బాబు త్యాగాన్ని ఈ దేశం ఎప్పటికీ మరవదని ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై కొనియాడారు.
ఇవీ చదవండి..
వాయుసేనలో ఈ చిన్నోడికి దూకుడెక్కువ..!