మహారాష్ట్రలో నేటినుంచి మరిన్ని కఠిన ఆంక్షలు!
close

తాజా వార్తలు

Published : 22/04/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో నేటినుంచి మరిన్ని కఠిన ఆంక్షలు!

ముంబయి: మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న వేళ ప్రభుత్వం నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌ ప్రకటించినా వైరస్‌కు బ్రేకులు పడకపోవడంతో ‘బ్రేక్‌ ద చైన్‌’పేరిట మరిన్ని కఠిన ఆంక్షలు ప్రకటించింది. గురువారం (ఈ నెల 22) రాత్రి 8గంటల నుంచి మే 1వరకు కొత్తగా ప్రకటించిన ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. ప్రైవేటు, ప్రభుత్వ (కేంద్ర/రాష్ట్ర) కార్యాలయాన్నీ (అత్యవసర సేవలు మినహా) 15శాతం మందితో మాత్రమే పనిచేసేందుకు అవకాశం కల్పించింది. వివాహాలు వంటి శుభకార్యాలకు 25మంది మించరాదని పరిమితి విధించింది. అలాగే, ఒకే హాలులో రెండు గంటలకు మించకుండా ఈ శుభ కార్యాన్ని పూర్తి చేసుకోవాలని, నిబంధనల్ని అతిక్రమిస్తే రూ.50వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ప్రైవేటు వాహనాలను అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తామని, అదీ డ్రైవర్‌తో కలిపి 50శాతం ప్రయాణికుల సామర్థ్యం మించరాదని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో అయితేనే నగరాల మధ్య, జిల్లాల మధ్య ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఎవరైనా నిబంధనల్ని అతిక్రమిస్తే రూ.10వేలు జరిమానా విధించడంతో పాటు లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించింది. 

అలాగే, ప్రైవేటు బస్సులు 50శాతం సామర్థ్యంతో నడిచేందుకు అవకాశం కల్పించింది. నగరాల మధ్య, జిల్లాల మధ్య ప్రయాణాలపైనా నియంత్రణ ఉంటుందని తెలిపింది. సిటీలో రెండు స్టాప్‌ల కన్నా మించి బస్సుల్ని ఆపరాదని సర్వీస్‌ ఆపరేటర్లను ఆదేశించినట్టు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 67వేలకు పైగా కొత్త కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని