
తాజా వార్తలు
మరోసారి లాక్డౌన్..మీ చేతుల్లోనే
ప్రజలకు ముంబయి మేయర్ హెచ్చరిక
ముంబయి: ‘నిబంధనలు పాటించకపోతే.. మరోసారి లాక్డౌన్ విధించాల్సి ఉంటుంది’.. ముంబయిలో మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మేయర్ కిశోరి పెడ్నేకర్ చేసిన హెచ్చరిక ఇది. రాజధాని నగరంతో పాటు మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. నిబంధనలు పాటించాలంటూ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రైలు ప్రయాణం చేసేవారిలో చాలా మంది మాస్కులు ధరించడం లేదు. ప్రజలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మరోసారి లాక్డౌన్ను విధించాల్సి ఉంటుంది. లాక్డౌన్ విధించాలా? వద్దా? అనేది ప్రజల చేతుల్లోనే ఉంది’ అని కిశోరి ప్రజలను అప్రమత్తం చేశారు.
దేశ వ్యాప్తంగా కొవిడ్ ప్రభావం తగ్గుతున్న సమయంలో మహారాష్ట్రలో కేసుల తీవ్రత పెరగడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 40 రోజుల తరవాత ఫిబ్రవరి 14న నాలుగువేల పైచిలుకు కేసులు వెలుగుచూశాయి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం..ఫిబ్రవరి 15న 3,365 కొత్త కేసులు నమోదు కాగా. .మొత్తం కేసుల సంఖ్య 20,67,643కి చేరింది. కొత్తగా 23 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 51 వేలకు పైబడింది. ముంబయిలో ఇప్పటి వరకు మూడు లక్షల మందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. కాగా, కొవిడ్ నియమాలు పాటించకపోతే.. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇప్పటికే ప్రజలను హెచ్చరించారు.