Everest: కరోనాను జయించి.. ఎవరెస్టును అధిరోహించి!

తాజా వార్తలు

Updated : 22/06/2021 12:24 IST

Everest: కరోనాను జయించి.. ఎవరెస్టును అధిరోహించి!

వైరస్‌ను జయించిన కొద్దిరోజులకే గమ్యం చేరుకున్న యువకుడు

దిల్లీ: ఎవరెస్టుపై కరోనా పంజా అంటూ వార్తలు..సహచరుల్లో కొవిడ్ లక్షణాలు..అనుకూలించని వాతావరణం..ఇవేవి తనకు అడ్డంకులు కాదని ముందుకు వెళ్తుంటే..తనకే కరోనా సోకినట్లు నిర్ధారణ. ఈసారి కూడా తన కల కల్లగానే మిగులుతుందా? ఇప్పుడు వెనక్కి తగ్గాలా? ముందుడుగు వేయాలా? అనే డైలమా. వీటన్నింటి మధ్య ‘నువ్‌ చేయగలవ్‌, వేచిచూడు’ అంటూ స్పష్టంగా వినిపించింది గుండె చప్పుడు. తన హృదయం మాట విని ముందుకు సాగిన ఓ కొవిడ్ విజేత ప్రయాణమిది. వైరస్ నుంచి కోలుకున్న కొద్ది రోజుల్లోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి అందరిచేత వాహ్‌ అనిపించున్న యువకుడి పయనమిది. ఆయనే 25 ఏళ్ల హర్షవర్ధన్ జోషి. 

మహారాష్ట్రలోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన హర్షవర్ధన్.. ఎవరెస్టు చేరుకోవాలనే కలను నిజం చేసుకునేందుకు ఐదేళ్లపాటు శిక్షణ తీసుకున్నారు.  తన సహచరులతో కలిసి ఉత్సాహంగా ముందుకు కదిలారు. అయితే బేస్ క్యాంప్‌కు చేరుకునేలోపే ఊహించని అవాంతరాలు ఎదురవుతాయని అప్పుడు ఆయనకు తెలీదు. జట్టులో సహచరులు దగ్గుతున్నప్పుడు కూడా ఆయనపెద్దగా పట్టించుకోలేదు. అధిరోహకుల్లో కుంభ్‌ కాఫ్‌ సహజమేని భావించారు. అక్కడున్న ఒక లోయపేరుతో దాన్నలా పిలుస్తారు. కరోనా, వాతావరణం సృష్టించిన అవాంతరాల మధ్య..ముందుకు సాగిన వైనాన్ని హర్ష మీడియాకు వెల్లడించారు. 

‘కరోనా ఎవరెస్టుకు చేరిందనే వార్తలతో మేం అప్రమత్తమయ్యాం. ఎవరి బబుల్‌లో వారే ఉంటూ..జాగ్రత్తలు తీసుకున్నాం. మేం కరోనా బారిన పడే ముందువరకు మా ప్రయాణమంతా సజావుగా సాగింది. అయితే ఎవరికి ఎప్పుడు కరోనా సోకిందో కూడా మాకు తెలీదు’ అని హర్షవర్ధన్ వెల్లడించారు. తరవాత ఆయనతో సహా ఒక్కొక్కరు అనారోగ్యానికి గురయ్యారు. దాంతో అనుమానించిన వైద్య సిబ్బంది వెంటనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ‘అది కరోనానా? లేక ఆ ఎత్తైన ప్రదేశం కారణంగా వచ్చే చిన్నపాటి అనారోగ్యమా? అనే విషయంలో మాకు స్పష్టత లేదు. కానీ మా తుది ప్రయాణం ప్రారంభమయ్యే సమయంలో మాకు పరీక్షలు జరిపారు. మే 8న నాకు పాజిటివ్ అని తేలింది. ఆ రిపోర్టు చూసి అదిరిపడ్డాను.

మరోవైపు వైద్యులు వెనక్కివచ్చేయమని చెప్పారు. ఒక్కసారిగా నా కల నాకు గుర్తుకువచ్చింది. మహమ్మారి కారణంగా ఇప్పటికే ఒకసారి ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీనా? నా శిక్షణ అంతా వృథా కావాల్సిందేనా? మళ్లీ స్పాన్సర్‌షిప్ కోసం ప్రయత్నాలు చేయాలా? ఇలా నా మనసులో గుబులుమొదలైంది. అలా అని నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లాలనుకోవడం లేదు. వేచి చూడాలని నిర్ణయించుకున్నాను. వెంటనే నన్ను నేను ఐసోలేట్‌ చేసుకున్నాను. ఎప్పటికప్పుడు నా పరిస్థితిని గమనించాను. నాకు లక్షణాలు కనిపించకపోవడంతో వెనక్కివెళ్లొద్దని గట్టిగా అనుకున్నా. అలాగే ఖాట్మండూ కంటే బేస్‌క్యాంప్ వద్ద కొవిడ్ పరిస్థితి మెరుగ్గా ఉంది. మరోపక్క నేను పూర్తిగా టీకాలు వేయించుకోవడం కలిసొచ్చింది. అవి తప్పకుండా పనిచేస్తాయి. అందుకే కరోనాను తీవ్రంచేసే వాతావరణంలో కూడా నేను గట్టెక్కాను.

ఇంకోవైపు చికిత్స తీసుకుంటూనే దగ్గర్లో ఉన్న కొన్ని శిఖరాలపైకి ఎక్కి నా ఆరోగ్యాన్ని అంచనావేసుకున్నా. అప్పుడు ఏ ఇబ్బంది అనిపించలేదు. శ్వాసకు ఆటంకం కలగలేదు. వైద్యులు కూడా ఇదేవిషయం చెప్పి..నేను ముందుకెళ్లొచ్చని సూచించారు. అలామొదలైన నా ప్రయాణం.. ఎట్టకేలకు మే 23న నేను కలగన్న గమ్యానికి చేరింది. శిఖరం పైభాగానికి చేరుకొన్న వేళ.. నాకు పట్టలేనంత ఆనందమేమీ కలగలేదు. సంతోషంగా అనిపించింది. మా ప్రయాణంలో అది 50 శాతం మాత్రమే. కిందికి దిగడంలోనే అసలు పరీక్ష ఉంది. కిందికి దిగేప్పుడు ఒక ఐదు రోజులు క్యాంప్ 2లో ఒంటరిగా ఉండాల్సివచ్చింది. అప్పుడు మా సీనియర్‌ గురించిన విషయం ఒకటి గుర్తొచ్చింది.  ఆయన మంచులో ఇరుక్కుపోయిన ఘటన నా మదిలో వణుకుపుట్టించింది. నాతోపాటు వచ్చిన షేర్పా ఖాళీ సిలిండర్లతో క్యాంప్‌ 1కి చేరుకున్నారు. ఆ సమయంలో నా ఫోన్‌లో పాటలు పెట్టుకొని, ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడతానా అని ఎదురుచూశాను. సాధించాననే ఆనందం, భయం కలిసికట్టుగా నన్ను చుట్టుముట్టాయి. వాటన్నింటిని దాటుకొని ఎట్టకేలకు మే 29న నా ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్నాను’ అంటూ తన సాహసయాత్ర గురించి చెప్పుకొచ్చారు.  

ఈ బృందం తమ ప్రయాణానికి ఒక అర్థాన్ని కూడా జతచేసింది. వారు సంప్రదాయ ఇంధన వనరులను సాధ్యమైనంత తక్కువగా వినియోగించారు. ‘పర్వత ప్రాంతం సులభంగా వాతావరణ మార్పులకు లోనవుతుంది. అందుకే మేం సంప్రదాయ ఇంధన వనరులవైపు మొగ్గుచూపలేదు. పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం’ అని జోషి వివరించారు. వారి రెండు నెలల ప్రయాణం నిమిత్తం సోలార్‌ ప్యానెల్స్‌, బ్యాటరీలని తీసుకెళ్లారు. ముంబయికి చెందిన చిరాగ్ రూరల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సహకారంతో వాటిని మారుమూల నేపాలీ గ్రామాల్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ మహమ్మారి వారి ఆశయాన్ని ఆటంకపరిచింది. దాంతో వాటిని విరాళంగా అందజేశారు. తాను అనుకున్న పనిని పూర్తిచేసేందుకు ఆయన మరోసారి శిఖరాన్ని అధిరోహించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. అన్నట్టు ఎవరెస్టు అధిరోహణతోనే ఆయన ఆగిపోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు హర్షకు కనిపిస్తోన్న శిఖరం ల్హోత్సే. ప్రపంచంలో నాలుగో ఎత్తైన పర్వతమది. ఎవరెస్టు కంటే దీనిపైకి చేరడమే క్లిష్టమట. ఇప్పుడు ఆ సవాలుకు సిద్ధమవుతున్నారు హర్షవర్ధన్ జోషి. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని