
తాజా వార్తలు
కరోనా బారిన మహారాష్ట్ర మంత్రులు!
రాష్ట్రంలో పెరుగుతోన్న వైరస్ ఉద్ధృతి
ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ మహారాష్ట్రలో మరోసారి విజృంభణ మొదలైంది. గత కొన్ని వారాలుగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రితో పాటు పలువురు మంత్రులు, నాయకులు వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా ముంబయి నగరంలో వైరస్ ఉద్ధృతి పెరగడంతో.. అక్కడ కరోనా మ్యుటేషన్ చెందిందా? అనే కోణంలోనూ నిపుణులు పరిశోధన చేపట్టారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత మరోసారి కలవరపెడుతోంది. రెండు నెలల విరామం తర్వాత రోజువారీ కేసుల సంఖ్య ఒక్కసారిగా ఐదు వేలకు చేరింది. ఈ నేపథ్యంలో తనకు వైరస్ నిర్ధారణ అయినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ థోప్ ట్విటర్లో వెల్లడించారు. ఇక ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ నేత, మంత్రి జయంత్ పాటిల్ కూడా వైరస్ పోకిన విషయాన్ని గురువారం వెల్లడించారు. రాష్ట్ర సహాయ మంత్రి ఓంప్రకాశ్ బాబారావ్ ఖడు తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రాజేంద్ర సింగ్నే వైరస్ బారినపడినట్లు రెండు రోజుల క్రితమే ట్విటర్లో వెల్లడించారు. మరో ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ఏక్నాథ్ ఖాడ్సే కూడా వైరస్ సోకిన విషయాన్ని తెలియజేశారు. అయితే, ప్రస్తుతం వీరందరి అరోగ్యం బాగానే ఉందని, తమతో సన్నిహితంగా మెలిగిన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ముంబయితోపాటు విదర్భ, అమరావతి ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో ఆంక్షలు విధిస్తున్నారు. వైరస్ కట్టడికి ప్రజలు సహకరించకపోతే ముంబయిలో మరోసారి లాక్డౌన్ విధించాల్సి వస్తుందని నగర మేయర్ ఈ మధ్యే ప్రజలను హెచ్చరించిన విషయం తెలిసిందే.