వామ్మో.. ‘మహా’ విజృంభణ! 
close

తాజా వార్తలు

Updated : 19/03/2021 13:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వామ్మో.. ‘మహా’ విజృంభణ! 

ఒక్కరోజులోనే మహారాష్ట్రలో అత్యధిక కేసులు

ముంబయి : మహారాష్ట్రను కరోనా మరోసారి వణికిస్తోంది. రోజురోజుకు అక్కడ ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్న కేసులు.. ఆ రాష్ట్రంతోపాటు, భారత్‌లో కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి.   ఇక గడిచిన 24 గంటల్లో ఏకంగా 25,833 కేసులు బయటపడ్డాయి. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఈ రాష్ట్రంలో 58 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. ఇక ఆర్థిక రాజధాని ముంబయిలో నిన్న ఒక్క రోజే మూడు వేలకు చేరువగా కేసులు నమోదయ్యాయి. 

మహారాష్ట్రలో ఇంతకుముందు సెప్టెంబర్‌ 11న అత్యధికంగా 24,886 కేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్యను నేడు నమోదైన కొత్త కేసులు అధిగమించాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24 లక్షలకు చేరింది. 53 వేల మందికిపైగా కరోనాతో మరణించారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కేంద్ర బృందం మహారాష్ట్రలో పర్యటించిన అనంతరం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి  రాజేశ్‌ భూషణ్‌ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు. కరోనా రెండో దశ రాష్ట్రంలో కొనసాగుతోందని ఈ బృందం హెచ్చరించింది. అవసరమైన చర్యలు తక్షణం చేపట్టాలని సూచించింది. ట్రాకింగ్‌, టెస్టింగ్‌ పద్ధతులను సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొంది.

కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ముంబయిలో లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తలను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే కొట్టిపారేశారు. కరోనా పరిస్థితిని  కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధమై ఉందని.. ముంబయిలో లాక్‌డౌన్‌ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, దేశంలోని కొవిడ్‌ క్రియాశీల కేసుల్లో 60 శాతానికి పైగా కేసులు కేవలం మహారాష్ట్రలోనే ఉన్నాయి. అంతేకాకుండా కరోనా మరణాలు కూడా ఇక్కడే అధికంగా నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతోన్న కొత్త కేసుల్లో సుమారు 85 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడులోనే వచ్చాయని ఆరోగ్య శాఖ తెలిపింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని