కరోనా నిజం.. కఠిన పాఠం..!
close

తాజా వార్తలు

Updated : 03/04/2020 01:11 IST

కరోనా నిజం.. కఠిన పాఠం..!

ఆలౌట్‌ వార్‌లో ‘మేకిన్‌ ఇండియా’నే శరణ్యం..!
ఇతర దేశాలపై ఆధారపడటమే అసలు ముప్పు
దేశీయ మేధస్సుకు మరింత పదునే మార్గం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేక కథనం

ఆశ మనల్ని బతికిస్తుంది.. ఇష్టం మనతో దేనినైనా చేయిస్తుంది.. అవసరం అన్నీ నేర్పిస్తుంది.. మానవ చరిత్ర వృద్ధికి మూలసూత్రాన్ని మూడు ముక్కల్లో ఇది చెప్పేస్తుంది. ప్రస్తుత పరిస్థితి భారత్‌కు మూడోదాన్ని గుర్తుచేస్తోంది. ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్‌ విజృంభిస్తుండటంతో అమెరికా, ఇటలీ, చైనా వంటి దేశాల్లో ప్రజలు పిట్టల్లా నేలరాలిపోతున్నారు. అవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు. టెక్నాలజీకి పెట్టిందిపేరు. కానీ, భారత్‌ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ భరతమాత 130 కోట్ల మంది బిడ్డల ప్రాణాలపై తీవ్ర ఆందోళన చెందుతోంది. 

కనీస వైద్య సౌకర్యాలు కూడా లేని ప్రాంతాలు దేశంలో కోకొల్లలు. ఇక వచ్చింది ఏ వ్యాదో కూడా తెలుసుకోలేని అమాయక గ్రామీణులున్న దేశం ఇది. భవిష్యత్తులో గ్రామీణ భారతావని కరోనాకు కేంద్ర బిందువుగా మారుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్‌ సైంటిస్టు సౌమ్యస్వామినాథన్‌ కూడా ఆందోళన వెలిబుచ్చారు. మరోపక్క ప్రతి విషయంలో భారత్‌ కొరతను ఎదుర్కొంటోంది. ఫేస్‌మాస్క్‌లు, వ్యక్తిగత రక్షణ సామగ్రి, వెంటిలేటర్లు, ఐసోలేషన్‌ వార్డులు, వైద్యసిబ్బంది.. ఇలా అన్నింట్లో ఇబ్బందులే. మరోపక్క ఇదే సమయంలో భారత ప్రభుత్వానికి.. ప్రజలకు మాత్రం ఒక దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.. ఆధారపడటం ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది. మరో దేశంపై ఆధారపడటమంటే.. దేశంలో సృజనాత్మకతను నిలువరించి కొత్త  ఆవిష్కారాలకు పురిట్లోనే గండికొట్టడం. మనం ఇప్పుడు వాడుతున్న ఎన్నో టెక్నాలజీలకు ఒకటి, రెండు ప్రపంచ యుద్ధాలు పురుడు పోశాయనేది కాదనలేని నిజం.

 ప్రస్తుతం  కరోనాపై సమరం మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోంది. కాకపోతే ఇందులో దేశాలు పరస్పరం సహకరించుకొనే సమయం లేదు.. ఎవరిని వారు కాపాడుకోవడమే ముఖ్యం. ప్రపంచ ఉత్పత్తి రంగానికి కేంద్రబిందువైన చైనా కూడా మాస్కుల కొరత ఎదుర్కొందంటే పరిస్థితులు ఎంతగా మారిపోతాయో అర్థం చేసుకోవచ్చు. దీంతో పేద దేశమైన భారత్‌ సర్వశక్తులు కూడదీసుకొని కరోనా మహమ్మారిపై పోరాటానికి సిద్ధమైంది. ఇక్కడ భరతమాత ఆయుధం తన బిడ్డలు.. వారి మేధస్సే. ఇది డేవిడ్‌ వర్సెస్‌ గోలియత్‌ యుద్ధాన్ని తలపిస్తోంది..! 

సర్వశక్తులు కూడదీసుకొని..

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చేయిచేయి కలిపి రంగంలోకి దిగాయి. డీఆర్‌డీవో, ఇస్రో, ఐసీఎంఆర్‌, సీసీఎంబీ, రైల్వే, వంటి ప్రభుత్వ రంగ సంస్థలు యుద్ధప్రాతిపదికన ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. వీటికి మారుతీ, మహీంద్రా, టాటా, రిలయన్స్‌, మైల్యాబ్‌, సిప్లా, సన్‌ఫార్మా ఇలా దేశీయ దిగ్గజ ప్రైవేటు కంపెనీలు తమ లాభాపేక్షను పక్కనపెట్టి నడుం బిగించాయి. వీరికి త్రివిధ దళాలు కూడా జతకలిశాయి.

బాడీసూట్స్‌..

కరోనాపై పోరులో ముందుండి పోరాడేది వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందే. వారి ప్రాణాలు మనకు ఎంతో అమూల్యమైనవి. వాటిని కాపాడాలంటే సరైనా రక్షణ కవచాలు ఉండాలి. ముఖ్యంగా హజ్మత్‌ సూట్‌ కొరత భారత్‌లో తీవ్రంగా ఉంది. దీని తయారీకి నమూనా సూట్‌ను కోయంబత్తూరులోని తయారీ కేంద్రానికి పంపేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక విమానాన్నే పంపిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా డీఆర్‌డీవోకు చెందిన న్యూక్లియర్‌ మెడిసన్‌ అండ్‌ అలైట్‌ సైన్సెస్‌ సంస్థ బాడీసూట్‌ను అభివృద్ధి చేసింది. ఇది వాషబుల్‌ మెటీరియల్‌తో తయారైంది. ఇది డాక్టర్లు, మెడికల్‌ స్టాఫ్‌ను వైరస్‌ బారి నుంచి కాపాడుతుంది. పునర్‌ వినియోగానికి దీనిలో అవకాశం ఉండటంతో కొత్తవాటి కోసం ఒత్తిడి తగ్గుతుంది. ఈ సంస్థ  గతంలో అణుదాడి జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అవసరమైన కిట్‌ను కూడా అభివృద్ధి చేసింది. తాజాగా కోవిడ్‌పై పోరాటంలో బాడీసూట్‌ను తయారు చేసింది. దీని ఖరీదు రూ.7వేల వరకు ఉండొచ్చు. అంటే మనం వాడే బ్రాండెడ్‌ జీన్స్‌ ఖరీదంత. దీని తయారీ బాధ్యతలను కోల్‌కతాకు చెందిన ‘ఫ్రాంటియర్‌ ప్రొటెక్టీవ్‌ వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు, ముంబయికి చెందిన ‘మెడికిట్‌’ ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు అప్పగించారు. వీరు రోజుకు 10,000 సూట్లు తయారు చేసి ఇవ్వనున్నారు. అంటే నెలకు 3లక్షలు రీయూజబుల్‌ సూట్లు అందుబాటులోకి రానున్నాయి. 

వెంటిలేటర్లపై దృష్టి..  

కరోనావైరస్‌ చికత్సలో వెంటిలేటర్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. రోగికి న్యూమోనియా ముదిరిపోతే ఊపిరితిత్తులు నీటితో నిండిపోతాయి. ఆ సమయంలో వారు శ్వాశ తీసుకోవడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే వారికి వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేస్తే కొన్నాళ్లలో వారిలో రోగనిరోధక శక్తి పెరిగి కోలుకుంటారు. 130 కోట్ల మంది ఉన్న భారత్‌లో వెంటిలేటర్ల సంఖ్య 50వేలకు మించదు. అది కూడా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఎక్కువ. జన సాంధ్రత ఎక్కువగా ఉన్న భారత్‌లో 1 శాతం మంది కరోనా బారిన పడినా.. ఆ సంఖ్య 1.3 కోట్ల వరకు ఉండొచ్చు. ఇది చాలా తక్కువ. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ వ్యవస్థాపక డైరెక్టర్‌ రమణన్‌ లక్ష్మీనారయణన్‌ అంచనాల ప్రకారం కనీసం భారత్‌లో 30 కోట్ల మంది ఈ వ్యాధిబారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి అంచనా నేపథ్యంలోనే ప్రభుత్వం సచేతనమైపోయింది. వెంటిలేటర్ల తయారీని పెంచాలని ఆదేశించింది. కానీ, ముడిసరుకు చైనా నుంచి రావాల్సి ఉంది. దీంతో దేశీయ వెంటిలేటర్లనే అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మహీంద్రా సంస్థ ముందుకొచ్చి దేశీయంగా కొన్నిరకాల వెంటిలేటర్లను అభివృద్ధి చేసింది. వీటికి అనుమతులు వస్తే ఉత్పత్తులను ప్రారంభిస్తామని పేర్కొంది. అది కూడా రూ.5-10లక్షల విలువైన వెంటిలేటర్లను రూ.7,500కే తయారు చేసింది. వాస్తవానికి ఇది మేకిన్‌ ఇండియా శక్తి..! రూ.10లక్షల వెంటిలేటర్‌ అంత సమగ్రంగా ఇది ఉండకపోవచ్చు.. కానీ, చిన్నచిన్న మార్పులు చేసి అవసరాలకు ఆదుకొని ప్రాణాలను అయితే కాపాడవచ్చు. స్కన్‌రాయ్‌ టెక్నాలజీస్‌ 2 నెలల్లో లక్ష వెంటిలేటర్లు తయారు చేస్తామని పేర్కొంది. 

మరోపక్క బెంగళూరులోని ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీవోకు చెందిన డీఈబీఈఎల్‌ కూడా వీటిపై దృష్టి సారించింది. లక్షల సంఖ్యలో వెంటిలేటర్ల తయారీకి సమయం లేకపోవడంతో ఒకే వెంటిలేటర్‌ను పలువురు పేషెంట్లకు ఏకకాలంలో వినియోగించేలా పరికరాన్ని అభివృద్ధి చేసింది. మరోవారంలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. తొలినెలలో 5వేలు, తర్వాతి నెలలో 10వేలకు ఉత్పత్తిని పెంచనున్నట్లు పేర్కొంది. దీని ఖరీదు రూ.4లక్షలవరకు ఉన్నా.. ఒకేసారి ఎక్కువ మంది పేషెంట్లకు ఉపయోగపడనుంది. మారుతీ సంస్థ వెంటిలేటర్ల తయారీతోపాటు విడిభాగాలను కూడా రూపొందిస్తామని పేర్కొంది. 

ఎన్‌99 మాస్క్‌ల అభివృద్ధి..

డీఆర్‌డీవో అత్యంత సురక్షితమైన ఎన్‌99 మాస్కులను దేశీయంగానే అభివృద్ధి చేసింది. ఇది ఐదు అంచెల రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది. దీనిలో రెండు పొరలు నానోమెష్‌ మెటీరియల్‌తో చేశారు. ఈ మెటీరియల్‌ను అహ్మదాబాద్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీస్‌ రీసెర్చి అసోసియేషన్‌ అభివృద్ధి చేసింది. ఇదే సంస్థ ఎన్‌95 మాస్క్‌లను కూడా ఉత్పత్తి చేస్తోంది. ఈ మాస్క్‌ ఖరీదు రూ.70 మాత్రమే కావడం విశేషం. నేరుగా పేషెంట్లకు వైద్యం చేసే సిబ్బందికి చాలా అవసరం. 

మహీంద్రా ఫేస్‌ షీల్డ్‌..

ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా ఫేస్‌ షీల్డ్‌ల తయారీ ప్రారంభించింది. తొలుత వీటిని రోజుకు 500 యూనిట్లు ఉత్పత్తి చేస్తామని పేర్కొంది. ఇది వైద్యసిబ్బందికి అత్యంత కీలకమైన పరికరం. ఫోర్డ్‌ మోటార్‌ నుంచి డిజైన్‌ తీసుకొని దేశీయంగా వీటిని తయారు చేస్తోంది. భవిష్యత్తులో వీటి ఉత్పత్తి మరింత పెరగవచ్చు. 

మైల్యాబ్‌ టెస్టింగ్‌ కిట్స్‌..

కరోనా పరీక్షలకు గతంలో దాదాపు 7గంటల సమయం పట్టేది. కానీ, పుణెకు చెందిన మైల్యాబ్‌ సంస్థ కిట్‌తో పెద్ద లేబొరేటరీల్లో వెయ్యి నమూనాలను, చిన్న ల్యాబ్‌లలో 200 నమూనాలనూ పరీక్షించవచ్చు. పరీక్ష ఫలితాలు రెండున్నర గంటల్లోనే లభిస్తాయి. ఒక్కో కిట్‌ ధర రూ.1,200గా నిర్ణయిస్తారని తెలిసింది. మై ల్యాబ్‌ కిట్‌లో వాడే విడి భాగాలేవీ చైనా నుంచి దిగుమతి కావడం లేదు. వాటిలో అత్యధికం భారత్‌లోనే తయారవుతాయి.

సీసీఎంబీ రంగంలోకి..

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) కూడా కరోనాపై చురుగ్గా పాల్గొంటోంది. వీలనైంత చౌకగా పరీక్షలు నిర్వహించడం ఈ ప్రక్రియలో చాలా కీలకం. ప్రస్తుతం ఈ సంస్థ అభివృద్ధి చేసిన కిట్‌తో తొలుత 60 పరీక్షలు నిర్వహించి ఫలితాలను పోల్చనున్నారు. ఈ కిట్‌ అందుబాటులోకి వస్తే ధర రూ.1000 కిందకు చేరుతుంది.

శానిటైజర్ల తయారీ..

భారత్‌లో చక్కెర పరిశ్రమలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ఆల్కహాల్‌ తాయరీ కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శానిటైజర్ల కొరతకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి డీఆర్‌డీవో వీటిని తయారు చేసి కీలక ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేస్తోంది. 

రైల్వే కోచ్‌లే ఐసోలేషన్‌ వార్డులుగా..

భారత్‌లో ఐసోలేషన్‌ వార్డుల కొరతను అధిగమించేందుకు రైల్వే కోచ్‌లను కూడా వినియోగించనున్నారు. ఈ ఆలోచన కేరళకు చెందిన అసెట్‌ హోమ్స్‌ అనే బిల్డర్‌కు వచ్చింది. ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఆచరణలో పెట్టంది. చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా.. చాలా మంది  రోగులకు ఐసోలేషన్‌ వార్డులు అందుబాటులోకి వస్తాయి. ఇది పూర్తి స్థాయిలో సాకారం అయితే కొన్ని లక్షల సంఖ్యలో ఐసోలేషన్‌ వార్డులు మన వద్ద ఉన్నట్లే. 

కొవిడ్‌పై యుద్ధంలో భారత్‌ చేస్తున్న ఏర్పాట్లను గమనిస్తే సర్వశక్తులు కూడదీసుకొంటున్న విషయం అర్థమవుతుంది. దీంతోపాటు భారత్‌లో తయారీ రంగం బాగా అభివృద్ధి చెందితే పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని తెలుస్తోంది. దీనికి ఉదాహరణే ఔషధ రంగం. కరోనాపై ప్రయోగించే మందుల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు భారత్‌లో కొరతలేదు. భారత్‌లోని ఔషధరంగం ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందడంతో ఇక్కడ ఇబ్బంది లేకుండా పోయింది.  తాజాగా ఇందులో కూడా బల్క్‌డ్రగ్స్‌ను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోకుండా భారత్‌లో ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.13వేల కోట్లను కేటాయించింది. అంటే ఈ రంగంలో పూర్తిసాధికారత వచ్చేస్తుంది. ఇదే స్పూర్తి మిగిలిన రంగాల్లో ఉంటే భారత్‌ కరోనా వంటి ఉపద్రవాలను తేలిగ్గా ఎదుర్కొంటుంది. దీనికి మనమెంత చేస్తామనేది నిర్ణయించుకోవాలి. ఇప్పటికైతే ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ.. సామాజిక బాధ్యతతో మెలగటమే అత్యుత్తమ సహకారం..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని