సాగర్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు కీలకం: మాణికం
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 17:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాగర్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు కీలకం: మాణికం

హైదరాబాద్‌: నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి చాలా కీలకమని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్‌ అన్నారు. సాగర్‌ ఎన్నికను ఉప ఎన్నికగానే చూడొద్దని.. ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తిస్థాయిలో కష్టపడి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో మాణికం ఠాకూర్‌ జూమ్‌ యాప్‌ ద్వారా సమావేశమయ్యారు. 

బూత్‌ స్థాయిలో కష్టించి పనిచేసి మంచి ఫలితాలు వచ్చేలా చూడాలని మాణికం ఠాకూర్‌ సూచించారు. తెరాస, భాజపాలను ఓడించేందుకు నేతలు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. తెరాస, భాజపాలు బయట కుస్తీ.. లోపల దోస్తీలా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తమ అభ్యర్థి జానారెడ్డి మంచి పలుకుబడి ఉన్న నేత అని.. ఆయన విజయం ఖాయమని ఠాకూర్‌ ధీమా వ్యక్తం చేశారు. మరింత కష్టపడి ఆయనకు మంచి మెజారిటీ తీసుకురావాలని నేతలను కోరారు.

ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి: భట్టి

ప్రతి కార్యకర్తా తానే పోటీలో ఉన్న అభ్యర్థిగా భావించుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సీఎల్పీ నేత  భట్టి విక్రమార్క సూచించారు. ఈ పది రోజులు ఎవరికి కేటాయించిన గ్రామాల్లో వారు ఉంటూ ప్రతిక్షణం పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కోరారు. ఉప ఎన్నిక ఒక నియోజకవర్గంలోనే జరుగుతున్నా.. ఇది రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేది కావాలన్నారు. భాజపా, తెరాస ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని భట్టి పిలుపునిచ్చారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని