
తాజా వార్తలు
మురికి వీరుడు.. 65ఏళ్లుగా స్నానం చేయలేదట!
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచంలో సాధారణ మానవుల జీవన శైలికి పూర్తి విభిన్నంగా జీవించే వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఉదాహరణకు ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ప్రోగ్రాంలో కనిపించే సాహస వీరుడు బేర్ గ్రిల్స్ ఎవరూ ఊహించని విధంగా వింతగా తన జీవితాన్ని గడిపే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇరాన్‌లోనూ ఓ వింత మనిషి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. దాదాపు 65 ఏళ్లుగా స్నానం చేయకుండా ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అతడి జీవన శైలీ సాధారణ మనుషులకు పూర్తి విభిన్నంగా ఉండటం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. అమౌ హాజి అనే 83 ఏళ్ల వృద్ధుడు ఇరాన్‌లోని ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఈ వృద్ధుడు దాదాపు 65 ఏళ్లుగా స్నానం చేయకుండా జీవిస్తున్నాడు. దీంతో ఇతడు ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా చరిత్ర సృష్టించాడు. తాను స్నానం చేయకపోవడానికి గల కారణాలపై హాజి స్పందిస్తూ.. ‘నాకు నీరు అంటే భయం. అందుకే 65 ఏళ్లుగా స్నానం చేయలేదు’ అని చెప్పారు. అంతేకాకుండా తనకు స్నానం చేయడం వల్ల అనారోగ్యం బారిన పడతాననే భావన కూడా ఉందని చెప్పాడు.
ఎడారి ప్రాంతంలో ఒంటరిగా నివసించే హాజికి మాంసాహారం అంటే ఎంతో ఇష్టం. పోర్కుపైన్ మాంసాన్ని ఇష్టంగా తింటానని హాజి తెలిపాడు. ఆయనకు ఇంట్లో చేసిన వంట అంటే నచ్చవని చెప్పాడు. ఎన్నో ఏళ్లుగా తాను ఇలా మురికిగానే జీవిస్తున్నానని చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హాజి అంత మురికిగా ఉన్నప్పటికీ అతడికి ఇప్పటివరకూ ఎలాంటి వ్యాధులు సోకలేదు. అమౌకు సిగరెట్ తాగడం అంటే ఇష్టం. గ్రామస్థులు తనకు సిగరెట్లు ఇచ్చినప్పటికీ.. అవి అయిపోయాక అమౌ పొగాకు బదులుగా జంతువుల పేడను ఉపయోగిస్తాడని గ్రామస్థులు చెబుతున్నారు. హాజికి ఇళ్లు లేదు.. ఎడారి ప్రాంతంలోనే గుంతలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. సమీప గ్రామస్థులు అతడికి ఓ గుడిసె నిర్మించి ఇచ్చినా.. అందులో ఉండేందుకు అతడు ఆసక్తి చూపలేదు.
ఇదీ చదవండి..
భారత్ పాక్ సరిహద్దుల్లో గణతంత్ర వేడుకలు రద్దు