ఈటల ఆరోపణలు సత్యదూరం: మంత్రి కొప్పుల
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈటల ఆరోపణలు సత్యదూరం: మంత్రి కొప్పుల

హైదరాబాద్: తెరాసలో తనకు గౌరవం, విలువ దక్కలేదంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణలు సత్యదూరమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పార్టీలో తొలి నుంచీ ఆయనకు ప్రాధాన్యమివ్వడాన్ని తాము కళ్లారా చూశామని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మరో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్‌ మీడియాతో మాట్లాడారు. 

ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో అర్థం కాలేదు

‘‘2004 ఎన్నికల్లో కమలాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్‌కు తెరాస నుంచి 23 మంది ఆశావహులు ఉన్నారు. వాళ్లంతా ఉద్యమంలో పనిచేసి అవకాశమిస్తే పోటీ చేస్తామని  ఎదురు చూస్తున్న వాళ్లే. కానీ ఈటల రాజేందర్‌ వచ్చిన తర్వాత ఆయన్ను గౌరవించి కేసీఆర్‌ అవకాశమిచ్చారు. ఈటల ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శాసనసభలో ఫ్లోర్‌ లీడర్‌గా నియమించడంతో పాటు పార్టీలోనూ మంచి ప్రాధాన్యం కల్పించారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన  తర్వాత ఈటలకు అత్యంత గౌరవం లభించింది. మొదటి మంత్రివర్గంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖను కేసీఆర్‌ ఆయనకు అప్పగించారు. మంత్రి వర్గ ఉపసంఘంలోనూ ప్రాధాన్యం కల్పించారు. తరచూ అసంతృప్తిని వెళ్లగక్కుతూ.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపైనా  సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేయడం బాధాకరం. అలాంటి సందర్భంలోనూ ఆయన వ్యాఖ్యలపై పార్టీ  స్పందించలేదు. ఆయనకు ఎక్కడా గౌరవం తగ్గలేదు. ఈటలకు ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో అర్థం కావడం లేదు’’ అని చెప్పారు. 

అసైన్డ్‌ భూములు కొనడం తప్పు అనిపించలేదా?

అసైన్డ్‌ భూములను వ్యాపారం కోసం కొన్నట్లు ఈటలే స్వయంగా చెప్పారని.. 1995లో పేదలకు ఇచ్చిన ఆ భూములను కొనడం తప్పు అనిపించలేదా? అని కొప్పుల ప్రశ్నించారు. ప్రస్తుతం దాదాపు రూ.కోటిన్నర విలువ  చేసే భూములను రూ.6లక్షలకే ఎలా కొన్నారని నిలదీశారు. అసైన్డ్‌ భూముల అమ్మకం, కొనుగోళ్లు చేయొద్దని చట్టం చెబుతున్నా వాటిని కొనేందుకు ఎందుకు సాహసించారని ప్రశ్నించారు. ఇది ఎస్సీలకు నష్టం చేకూర్చినట్లా? లాభం చేసినట్లా? అని దుయ్యబట్టారు. వీటిపై ఈటల సమాధానం చెప్పాలన్నారు. అసైన్డ్‌ భూములు ఎన్నిసార్లు అమ్మినా వాటిని తిరిగి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందన్నారు. అక్కడి రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే సమాధానం చెప్పాల్సింది పోయి ప్రభుత్వం, సీఎంపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని కొప్పుల ఈశ్వర్‌ ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవడం.. పార్టీని గందరగోళానికి గురిచేయడమే ఉద్దేశమా? అని నిలదీశారు. ఈటల వ్యాఖ్య్లలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 

బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల: గంగుల కమలాకర్‌

బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్‌ అని మరో మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. ఆయన హుజూరాబాద్‌లో బీసీ, హైదరాబాద్‌లో ఉంటే ఓసీ అని వ్యాఖ్యానించారు. పదవిలో ఉన్నప్పుడు ఈటలకు బీసీలు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎప్పుడైనా ముదిరాజ్‌ సమస్యలపై మాట్లాడారా? అని మంత్రి కమలాకర్‌ నిలదీశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని