
తాజా వార్తలు
ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
హైదరాబాద్: కొవిడ్ టీకాలు చాలా సురక్షితమైనవి, టీకా వేయించుకునేందుకు ఎవరూ భయపడొద్దని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ టీకా వేయించుకునేందుకు ప్రజా ప్రతినిధులంతా సిద్ధంగా ఉన్నారని, ప్రధాని సూచనమేరకే ముందుగా టీకా వేయించుకోవడం లేదన్నారు. కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులం కూడా త్వరలో టీకా వేయించుకుంటామని తెలిపారు. మనదేశ పరిస్థితులకు అనుగుణంగా టీకా తయారీ జరిగిందన్నారు. హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కూడా తయారు చేసిందని, టీకా తయారీ దారుల్లో హైదరాబాద్ సంస్థ ఉండటం గర్వకారణమన్నారు. మెడికల్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకత్వంలో అందరికీ టీకా అందుతుందని స్పష్టం చేశారు. మహమ్మారికి ముగింపు ప్రారంభమైందని, అందరూ సుఖ సంతోషాలతో ఉండే రోజులు వస్తాయని ఆశిస్తున్నామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కలెక్టర్ శ్వేతా మహంతి, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..
అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం