దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ: నిరంజన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Published : 20/06/2021 01:29 IST

దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్: రైతుబంధు సాయం ద్వారా సాగు విస్తీర్ణం పెరిగి గణనీయమైన దిగుబడులు సాధిస్తూ తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఆవిర్భావ సమయంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములను ఇవాళ 29.26 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గిడ్డంగులతో పాటు రైతు వేదికలు, పత్తి మిల్లులు, అవకాశం ఉన్న ప్రతి చోటా ధాన్యం నిల్వ చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై విమర్శలు చేసే విపక్షాలు ముందు ఇంత దిగుబడి ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలని హితవు పలికారు. 2014-15 వానాకాలం, యాసంగి కలిపి 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే.. 2021 యాసంగిలోనే 90.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం ఓ అరుదైన రికార్డని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి రాయితీ సొమ్ము జమ అవుతోంది. ఐదవ రోజైన ఇవాళ 4.90 లక్షల మంది రైతుల ఖాతాల్లో 102.92 లక్షల ఎకరాలకుగాను రూ. 1,050.10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 54.37 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో రూ.5,145.87 కోట్ల రూపాయలు జమ అయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 3,97,260 మంది రైతులకు రూ.401.92 కోట్లు, అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 27,819 మంది రైతులకు రూ.19.68 కోట్లు పంపిణీ అయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని