బెంగాల్‌లో హింసపై మోదీ ఆవేదన!
close

తాజా వార్తలు

Published : 05/05/2021 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాల్‌లో హింసపై మోదీ ఆవేదన!

పరిస్థితిపై ఆరా తీసినట్లు వెల్లడించిన గవర్నర్‌

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పశ్చిమ బెంగాల్‌లో పెద్దయెత్తున హింస చెలరేగిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్ ధనకర్‌ వెల్లడించారు. ఈ మేరకు ఈరోజు తనకు ప్రధాని ఫోన్‌ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆరా తీసినట్లు తెలిపారు. 

‘‘రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న శాంతి భద్రతల అంశంపై ప్రధాని మోదీ నాకు కాల్‌ చేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో హింస, విధ్వంసం, కాల్పులు, దోపిడీ, హత్యలు నిరంతరాయంగా కొనసాగుతుండడంపై నా ఆందోళనలను ఆయనతో పంచుకున్నాను. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సంబంధిత యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలి’’ అని ధన్‌కర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ సందేశానికి మమతా బెనర్జీ ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేయడం గమనార్హం. 

అంతకుముందు, రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తేవాలని జగదీప్‌ ధన్‌కర్‌ మమతా బెనర్జీని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా ఉన్నట్లు తనకు సమాచారం ఉందని తెలిపారు. అనేక మంది ప్రాణాలను కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారని పేర్కొన్నారు. దుండగులు హింసను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. ఇలా రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడం సహించలేనిదని వ్యాఖ్యానించారు. విచక్షణారహితంగా జరుగుతున్న ఈ ఘటనలకు రాష్ట్ర పోలీసు శాఖ, కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వెంటనే స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెంగాలీలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఒక్క బెంగాల్‌లోనే ఎందుకు హింస చెలరేగుతోందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై ఈ దాడి ఎందుకు జరుగుతోందని ట్విటర్‌లో ప్రశ్నించారు.   

ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ దాడుల్లో తమ పార్టీ కార్యకర్తలు ఆరుగురు మృత్యువాతపడ్డారని, పలువురు గాయపడ్డారని భాజపా సోమవారం ఆరోపించిన విషయం తెలిసిందే. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘర్షణలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. వెంటనే తమకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. ఘర్షణలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో భాజపా పలు వీడియోలను పోస్ట్‌ చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని