
తాజా వార్తలు
కోతి తోక గడ్డం.. ఇప్పుడిదే ట్రెండ్!
ఇంటర్నెట్ డెస్క్: ఐస్ బకెట్.. రైస్ బకెట్.. గ్రీన్ ఛాలెంజ్.. నో మేకప్ ఛాలెంజ్ ఇలా సోషల్‌మీడియాలో అనేక ఛాలెంజ్‌లు ట్రెండ్ అయ్యాయి.. అవుతున్నాయి. ఒకరు దాన్ని ప్రారంభించి.. మరికొంత మందికి ఛాలెంజ్ చేస్తారు. దాన్ని స్వీకరించిన వారు.. ఆ పనిని చేసి చూపించి మరికొంతమందికి ఛాలెంజ్ విసరాలి. అయితే, తాజాగా మరో ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. అదే ‘మంకీ టెయిల్ బియర్డ్ (కోతి తోక ఆకారంలో గడ్డం)’ ఛాలెంజ్. చాలా మంది మగవాళ్లు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి, గడ్డాన్ని ‘మంకీ టెయిల్’గా మార్చి.. ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు.
కోతి తోక కాస్త పొడవుగా ఒక ఒంపు తిరిగి ఉంటుంది. ఆ ఆకృతిలోనే గడ్డం గీసుకొని ఫొటో తీసి సోషల్‌మీడియాలో పెట్టాలి. ఇదే మంకీ టెయిల్ బియర్డ్ ఛాలెంజ్. నిజానికి ఈ విధమైన గడ్డాన్ని 2019లో అమెరికాకు చెందిన బేస్‌బాల్ క్రీడాకారుడు మైక్ పియర్స్ ‘క్యాట్ టెయిల్’ పేరుతో ప్రారంభించాడు. గడ్డాన్ని కుడివైపు చెవి దగ్గర నుంచి దవడపై ఒంపు తిప్పి పై పెదవి కుడివైపు చివరి వరకు ఉంచి.. మిగతా భాగంలో గడ్డాన్ని పూర్తిగా తీసేశాడు. అప్పుడు మైక్ విచిత్రమైన గడ్డాన్ని చూసి అందరూ నవ్వుకున్నారు. కానీ, ఎవరూ పెద్దగా అనుసరించలేదు.
ఇటీవల కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను అనేక దేశాల్లో సడలించడంతో.. ఇంట్లోనే ఉంటూ పెంచుకున్న జుట్టు, గడ్డంతో ప్రయోగాలు చేసేందుకు యువత సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి.. మైక్ మొదలుపెట్టిన ‘క్యాట్ టెయిల్’ను ‘మంకీ టెయిల్ బియర్డ్’ పేరుతో మళ్లీ ప్రారంభించాడు. దీంతో కొత్తదనాన్ని ఇష్టపడే మగవాళ్లంతా.. గడ్డాన్ని కోతి తోక మాదిరిగా గీసుకొని, సెల్ఫీ దిగి సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు. మరికొందరు ఈ తోక గడ్డానికి రంగులతో మెరుగులద్దుతున్నారు. అయితే.. ఈ ఛాలెంజ్ ప్రస్తుతం విదేశాల్లో ట్రెండ్ అవుతోంది.. త్వరలోనే మన దేశంలోనూ ఎవరో ఒకరు మొదలుపెట్టే అవకాశం లేకపోలేదు.
ఇవీ చదవండి..
జీన్స్‌తో జీవం ఉట్టిపడే కళాఖండాలు!
నీటిగుంటకు ఇన్‌స్టా ఖాతా.. దానికుందో పెద్ద కథ!