కక్ష సాధింపుతోనే నోటీసులు: రామ్మోహన్‌
close

తాజా వార్తలు

Updated : 16/03/2021 21:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కక్ష సాధింపుతోనే నోటీసులు: రామ్మోహన్‌

దిల్లీ: కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తెదేపా అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలపై గతంలో ఇలాగే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌పై ఎన్నో అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వైకాపా నేతలపై అవినీతి కేసులు ఉన్నందునే తెదేపా నేతలపై బురదజల్లాలని ఇలా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

సీఎం జగన్‌ తనపై ఉన్న కేసులను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని రామ్మోహన్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ అంశాన్ని సైతం ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే అధికార పార్టీ ఇలా చేస్తోందన్నారు. చంద్రబాబుపై కేసులు పెట్టేవారు మొదట వారిపై ఉన్న కేసుల గురించి ఆలోచించాలని హితవు పలికారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తెదేపా ఎక్కడ ముందుండి నడిపిస్తుందోననే భయంతోనే ఇలాంటి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తెదేపా నేతలకు ఎలాంటి భయం లేదని.. అక్రమ కేసులెన్ని పెట్టినా విశాఖ ఉక్కుపై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని