
తాజా వార్తలు
ముంబయిలో నేనుంటా.. ముంబయికి తోడుంటా..
తిరుగులేని కెప్టెన్‌గా రోహిత్
ముంబయిలోనే ఉంటాడు.. ముంబయికి తోడుంటాడు.. ముందెనకా గస్తీకాస్తుంటాడు. అతనే.. ముంబయికర్లు ముద్దుగా పిలుచుకునే వడాపావ్, హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ. ఇంతలా ఒక కెప్టెన్‌ను వర్ణించడం అతిశయోక్తి కావచ్చు. కానీ.. రోహిత్‌కు మాత్రం అతి కానే కాదు. 2013.. 2015.. 2017.. 2019.. 2020 ఇవి కేవలం సంవత్సరాలు మాత్రమే కాదు.. కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ట్రాక్రికార్డు. ఈ నంబర్లే చెబుతాయి అతని విలువను, స్థాయిని. ఆటగాడిగా ఏడు సార్లు ఛాంపియన్ జట్టులో సభ్యుడు. కెప్టెన్‌గా ఐదుసార్లు ట్రోఫీని జట్టుకు అందించాడు. తాజాగా టీ20లీగ్ 13వ సీజన్లోనూ జట్టును ఛాంపియన్‌గా నిలిపి తన జట్టును ఎవరికీ అందనంత ఎత్తులో పెట్టాడు. టీ20 లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అవతరించాడు.
2011లో ముంబయి ఏకంగా అదృష్టాన్ని కొనుక్కొంది
లీగ్ ప్రారంభ సంవత్సరం 2008లో దక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన రోహిత్.. మంచి ప్రతిభ కనబరిచాడు. వరుసగా మూడు సీజన్లలోనూ 350కిపైగా పరుగులు చేసి అందరి దృష్టి ఆకర్షించాడు. దీంతో 2011లో రూ.12కోట్లు పెట్టి ముంబయి హిట్‌మ్యాన్‌ను సొంతం చేసుకుంది. తొలి రెండేళ్లలో తీవ్ర నిరాశపరిచిన రోహిత్ 2013నుంచి తన సత్తా చూపించాడు. సచిన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ముంబయి జట్టును తిరుగులేని శక్తిగా మలిచాడు. అలా వేలంపాటలో అన్ని జట్లు కోట్లు పెట్టి ఆటగాళ్లను కొంటుంటే.. ముంబయి మాత్రం ఆటగాళ్లతో పాటు అదృష్టాన్ని కొనుగోలు చేసింది.
ట్రోఫీలు సాగిలపడుతున్నాయి
ఒడుదొడుకుల్లోనూ అతని తెగువ.. ప్రత్యర్థులకు ప్రశ్నలు విసిరే అతని అడుగు.. బ్యాటింగ్‌లో పొగరు.. పాదరసానికే పదును పెట్టే ఆలోచన.. వెరసి సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీ సైతం ఈ హిట్‌మ్యాన్‌కు సలాం కొడుతూనే ఉంది. ఐదు ట్రోఫీలు సాధించిన రోహిత్‌ను మించిన కెప్టెన్ ఐపీఎల్ చరిత్రలో మరొకరు లేరు. అతని ముందు ట్రోఫీలు సాగిలపడ్డాయిలా..
► 2013లో ఐపీఎల్ ట్రోఫీ
► 2013లో ఛాంపియన్స్ టీ20 ట్రోఫీ
► 2015లో ఐపీఎల్ ట్రోఫీ
► 2017లో ఐపీఎల్ ట్రోఫీ
► 2019లో ఐపీఎల్ ట్రోఫీ
► 2020లో ఐపీఎల్ ట్రోఫీ
భారత ఇండియన్ జట్టు కెప్టెన్‌గానూ రోహిత్‌కు మంచి రికార్డు ఉంది. 2018లో నిదహాస్ ట్రోఫీ, 2018లో ఆసియాకప్ సాధించి పెట్టాడు.
ప్రత్యర్థికి ప్రధాన శత్రువు.. జట్టుకు అజాతశత్రువు
ఏ జట్టయినా విజయాలు సాధించాలంటే తెలివైన నాయకత్వం చాలా ముఖ్యం. జట్టును ఏకం చేసి ఆటగాళ్లతో కలిసిపోయే రోహిత్శర్మలో నాయకత్వ లక్షణాలకు కొదవలేదు. ఏ బ్యాట్స్‌మెన్‌ను ఎలాంటి బంతితో ఔట్ చేయాలి..? ఎక్కడ ఫీల్డర్లను మోహరించాలి..? ఎవరితో బౌలింగ్ చేయించాలి..? అనే విషయాల్లో రోహిత్ దిట్ట. ప్రత్యర్థికి ప్రధాన శత్రువులా కనిపించే హిట్‌మ్యాన్ జట్టు సభ్యులకు మాత్రం అజాతశత్రువు. క్వాలిఫయర్1 మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చి తీవ్ర నిరాశకు గురైన రాహుల్ చాహర్ విషయంలో రోహిత్ ప్రదర్శించిన తీరు నిజంగా ప్రశంసనీయం. జట్టు ఏ ఒక్కరిపై ఆధారపడదు అంటూ ఆటగాళ్లపై ఒత్తిడి తొలగించే తెలివైన కెప్టెన్ అతడు. అందుకే ముంబయి జట్టు యాజమాన్యం సైతం రోహిత్‌కు కెప్టెన్‌గా పూర్తి స్వేచ్ఛనిచ్చింది.
ఛాంపియన్ జట్టులో ఛాంపియన్ ఆటగాడే ఉంటాడు..
ఏడుసార్లు ఫైనల్ ఆడిన ఏకైక ఆటగాడు రోహిత్‌శర్మ. గతంలో దక్కన్ ఛార్జర్స్ తరఫున ఒకసారి, ప్రస్తుతం ముంబయి తరఫున ఆరుసార్లు ఫైనల్ ఆడాడు. అంటే రోహిత్ ఆరుసార్లు ఛాంపియన్ జట్టులో సభ్యుడు. ప్రపంచ క్రికెట్లో మరే ఆటగాడికి ఈ రికార్డు లేదు. రోహిత్ తర్వాత రాయుడు, పొలార్డ్, మలింగ ఉన్నారు. వాళ్లు నాలుగుసార్లు ఛాంపియన్ జట్టులో ఆటగాళ్లుగా ఉన్నారు. ఆ తర్వాత ధోనీ, రైనా, హార్దిక్ పాండ్య మూడు సార్లు ఛాంపియన్ జట్టులో సభ్యులుగా ఉన్నారు.
ప్రత్యేక మ్యాచ్‌లైతే ప్రత్యర్థికి చుక్కలే..
మామూలుగానే చెలరేగి బ్యాటింగ్ చేసే రోహిత్.. ఇక స్పెషల్ మ్యాచుల్లో ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. అతను తన 50వ మ్యాచ్.. 100వ మ్యాచ్.. 150వ మ్యాచ్.. 200వ మ్యాచ్‌లో అర్ధశతకాలతో విజృంభించడమే అందుకు ఉదాహరణ. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోయిన రోహిత్ నిన్న దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాణిస్తాడని ఎవరూ ఊహించి ఉండరేమో. కానీ.. ‘నీకిది 200వ మ్యాచ్ గుర్తుందా..’ అని ఎవరో చెవిలో చెప్పినట్లుగా.. వచ్చీ రావడంతోనే భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ప్రత్యర్థులకు ప్రమాద సంకేతాలు పంపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం దూకుడు తగ్గించకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో విమర్శకుల ప్రశ్నలకు ఇదే సమాధానం అనేంత కసిగా రోహిత్ బ్యాటింగ్ సాగింది. మొత్తానికి 51 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. తనలో పస ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఆఖరి పంచ్‌తో మంచి కిక్ ఇచ్చాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు కొట్టిన ఏకైక కెప్టెన్ రోహిత్శర్మనే. ఈ మ్యాచ్‌లో రోహిత్ చేసిన 68 పరుగులు లీగ్ చరిత్రలో రెండో అత్యధికం కూడా. రోహిత్కంటే ముందు వార్నర్ ఉన్నాడు.
టీ20లీగ్‌లో రోహిత్‌శర్మ ప్రయాణం..
మ్యాచులు - 200
పరుగులు - 5230
సగటు - 31.10
అత్యధిక స్కోరు - 109*(కోల్‌కతా మీద)
స్ట్రైక్‌రేట్ - 130.61
సెంచరీలు - 1
హాఫ్‌సెంచరీలు - 39
ఫోర్లు - 458
సిక్సర్లు - 213
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు - 18
క్యాచ్‌లు - 89
వికెట్లు - 15
ఉత్తమ బౌలింగ్ - 4/6
రోహిత్ కెప్టెన్‌గా..
మ్యాచ్‌లు - 116
గెలుపు - 70
ఓటమి - 46
ట్రోఫీలు - 6
ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రోహిత్‌సేన ట్రోఫీని గెలిచి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. అయితే.. మరో ఆరు నెలల్లో మరోసారి లీగ్ మనల్ని అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగే ముంబయి జట్టును అడ్డుకోవడానికి ప్రత్యర్థులంతా కలిసి ప్రణాళికలు వేసుకోవాలేమో మరి..!
- ఇంటర్నెట్ డెస్క్
ఇదీ చదవండి