
తాజా వార్తలు
ఆటగాళ్లకు క్వారంటైన్ నిబంధనల్లో సడలింపు
ముంబయి: ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ మీదుగా ముంబయి చేరుకున్న పలువురు టీమ్ఇండియా ఆటగాళ్లు, హెడ్కోచ్ రవిశాస్త్రికి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంస్థాగత క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులిచ్చారు. గురువారం ఉదయం రవిశాస్త్రితో పాటు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె, ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ శార్దూల్ ఠాకుర్, మరో యువ బ్యాట్స్మన్ పృథ్వీషా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు.
ఈ క్రమంలోనే తొలుత ఆయా ఆటగాళ్లు సంస్థాగత క్వారంటైన్లో ఉండాలనే ఆదేశాలు వచ్చాయి. అయితే, ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో బయో బబుల్లో ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వారికి ప్రత్యేకంగా నిబంధనలను సడలించినట్లు బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. దాంతో ఆటగాళ్లు గురువారం తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇక రహానె ఇంటికి చేరుకున్నాక అక్కడ కూడా ఘన స్వాగతం లభించింది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అతడికి స్వాగతం పలికారు. మరోవైపు కొత్తరకం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబయిలో అంతర్జాతీయ ప్రయాణికులపై కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి..
ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..