ఆదేశ సైన్యం అధికారాన్ని వీడాలి: యూఎస్‌
close

తాజా వార్తలు

Published : 24/02/2021 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదేశ సైన్యం అధికారాన్ని వీడాలి: యూఎస్‌

వాషింగ్టన్‌: మయన్మార్‌లో మిలిటరీ తన పరిపాలనాధికారాలను వెంటనే వదులుకోవాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా పౌర పాలన కోసం నిరసనలు చేస్తున్న అక్కడి ప్రజలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘మయన్మార్‌లో మిలిటరీ అవలంబిస్తున్న విధానాలపై మా వైఖరిలో మార్పు ఉండదు. వారు తప్పకుండా అధికారాన్ని వదులుకుని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ పరిపాలనను నెలకొల్పాలి. బర్మా ప్రజలకు అండగా ఉండేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్న అక్కడి ప్రజల ఆకాంక్షలకు మద్దతు ఇస్తున్న భాగస్వాములతో కలిసి మేం కొనసాగుతాం. ఆ దేశంలో సైనిక పాలనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే యూకే, కెనడాలు ఆంక్షలు విధించడాన్ని మేం అభినందిస్తున్నాం. శాంతియుత నిరసనలు చేస్తున్నవారిపై మిలిటరీ తమ హింసను ఆపాలని కోరుతున్నాం. అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలి. హింసను ప్రేరేపించే వారిపై, ప్రజలను అణచివేసే వారిపై చర్యలు తీసుకోవడానికి మేం వెనుకాడబోం’ అని యూఎస్‌ స్పష్టం చేసింది.

కాగా, ఇప్పటికే జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, యూకే, యూఎస్‌లు మయన్మార్‌లో కొనసాగుతున్న హింసను ఖండిస్తూ సంయుక్త ప్రకటన చేశాయి. అక్కడ సైన్యం హింసలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించాయి. హింసను ప్రేరేపించడం ఆమోదయోగ్యం కాదని తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని