నక్సల్స్‌ చెర నుంచి ఆ జవానుకు విముక్తి 
close

తాజా వార్తలు

Updated : 08/04/2021 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నక్సల్స్‌ చెర నుంచి ఆ జవానుకు విముక్తి 

ఐదు రోజుల తర్వాత విడుదల చేసిన మావోయిస్టులు

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్‌ ఆ జవానును విడుదల చేశారు. దీంతో ఆయన బీజాపూర్‌లోని సీఆర్పీఎఫ్‌ శిబిరానికి చేరుకున్నారు. బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దులో ఈ నెల 3న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 28మంది భద్రతా సిబ్బంది మృతిచెందగా.. రాకేశ్వర్‌ సింగ్‌ను మావోయిస్టులు అపహరించిన విషయం తెలిసిందే. జవాను తమ వద్ద బందీగా ఉన్నట్లు ఈ నెల 5న లేఖ విడుదల చేసిన నక్సల్స్‌.. బుధవారం ఆయన ఫొటోను పత్రికలకు పంపించారు. ఓ పూరి గుడిసెలో జవాను క్షేమంగా ఉన్నట్లు అందులో కన్పించింది. తమ తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను కుమార్తె చేసిన విజ్ఞప్తిని మీడియా ద్వారా స్వీకరించామని మావోయిస్టులు నిన్న ప్రకటించారు. 

రాకేశ్వర్‌ సింగ్‌ ఇంట్లో పండుగ వాతావరణం!

 మరోవైపు, కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్ సురక్షితంగా విడుదల కావడంతో జమ్మూలోని ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు. దీంతో ఆయన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. విడుదల సమాచారాన్ని ప్రసారమాధ్యమాల్లో తెలుసుకొని కుటుంబ సభ్యులు కేరింతలు కొట్టారు. మిఠాయిలు పంచారు. సీఆర్పీఎఫ్‌ అధికారులు కూడా ఆయన విడుదల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రాకేశ్వర్‌ సింగ్‌ సురక్షితంగా విడుదలయ్యేందుకు కృషిచేసిన ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

రాకేశ్వర్‌ సింగ్ స్వస్థలం జమ్మూ. 210వ కోబ్రా దళంలో విధులు నిర్వహిస్తున్నారు. జవానును కిడ్నాప్‌ చేశారన్న వార్త తెలియగానే ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు లోనైంది. తన భర్తను ప్రాణాలతో విడిపించి ఆదుకోవాలని ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని జవాను భార్య కోరారు. తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను ఐదేళ్ల కుమార్తె శ్రాగ్వి కన్నీళ్లతో కోరింది. చిన్నారి ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. రాకేశ్వర్‌ సోదరుడు గతంలో మెరుపుదాడి ఘటనలో చనిపోయారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని