NEET PG పరీక్షలు 4నెలలు వాయిదా 
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NEET PG పరీక్షలు 4నెలలు వాయిదా 

దిల్లీ: దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చిన వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ బాధితులకు చికిత్సలు అందించేందుకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదివే విద్యార్థులను విధుల్లోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నీట్‌-పీజీ పరీక్షను నాలుగు నెలల పాటు వాయిదా వేసింది. కొవిడ్‌పై పోరు వైద్య సిబ్బంది కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రధాని మోదీ ఆదివారం పలువురు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకునే అంశం చర్చకు వచ్చింది. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను బోధకుల పర్యవేక్షణలో స్వల్ప లక్షణాలున్న కొవిడ్‌ బాధితులకు చికిత్సలు అందించే విధుల్లో ఉపయోగించుకోవచ్చని పీఎంవో తెలిపింది. అలాగే బీఎస్సీ/జీఎన్‌ఎం ఉత్తీర్ణులైన నర్సులను.. సీనియర్‌ డాక్టర్లు, సీనియర్‌ నర్సుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి కొవిడ్‌ నర్సింగ్‌ విధుల్లోకి తీసుకోవచ్చని పేర్కొంది.

ఇందుకోసం నీట్‌ పీజీ పరీక్షను నాలుగు నెలలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ పరీక్ష ఏప్రిల్‌ 18న జరగాల్సి ఉండగా కరోనా దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. తాజాగా మరో నాలుగు నెలలు వాయిదా వేసింది. అంతేగాక, 100 రోజులు కరోనా విధుల్లో ఉన్న వైద్య సిబ్బందికి భవిష్యత్తులో జరగబోయే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని