కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు
close

తాజా వార్తలు

Published : 20/04/2021 21:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు

మరో మూడు వారాలు అత్యంత కీలకమని వ్యాఖ్య

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం మరోసారి హెచ్చరించింది. రానున్న మూడు వారాలు చాలా కీలకమని, కరోనా వ్యాప్తి నివారణ కోసం ముందస్తు ప్రణాళికలు రచించుకోవాలని సూచించింది. కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, పోలీసు అధికారులతో నీతిఆయోగ్‌ సభ్యుడు డా.వీకే పాల్‌ అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న మూడు వారాల్లో కరోనా వైరస్‌ మరింత విజృంభించే అవకాశం ఉండటంతో ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాజిటివ్‌ కేసులు గుర్తించేలా నిర్ధిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

దేశంలో కొవిడ్‌ 19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తదితర ఉన్నతాధికారులతో ‘దేశంలో కరోనా విజృంభణ’ అంశంపై వీకే పాల్‌ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. జనవరి 1 నుంచి దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10 రెట్లు కంటే ఎక్కువగా పెరిగినట్లు  అజయ్‌కుమర్‌ తెలిపారు. గడిచిన 11 రోజుల్లో రోజువారీ కేసులు 1.31లక్షల నుంచి 2.73 లక్షలకు పెరిగాయన్నారు.

కేంద్రం ఇంకేం చెప్పింది!

రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ఆస్పత్రులను పునరుద్ధరించాలని,  ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది. మరోవైపు  ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు వీకే పాల్‌కు వివరించారు. జనసంచారాన్ని తగ్గించేందుకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నామని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కూడా వేగవంతం చేశామని తెలిపారు. దాదాపు 90 శాతంపైగా ప్రజలను హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని