తగ్గని కొవిడ్‌ ఉద్ధృతి..పుణెలో కర్ఫ్యూ పొడగింపు!
close

తాజా వార్తలు

Published : 28/02/2021 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తగ్గని కొవిడ్‌ ఉద్ధృతి..పుణెలో కర్ఫ్యూ పొడగింపు!

అమరావతిలోనూ లాక్‌డౌన్‌ కొనసాగింపు

పుణె: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పుణెలో రాత్రి కర్ఫ్యూని మరో రెండు వారాలు పొడగిస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. అప్పటివరకు పాఠశాలలు, కాలేజీలు కూడా మూసే ఉంటాయని పుణె మేయర్‌ ప్రకటించారు.

దేశంలో నిత్యం నమోదవుతున్న కరోనా కేసుల్లో సగం మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. ముఖ్యంగా పుణె, నాగ్‌పూర్‌, అమరావతి ప్రాంతాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. పుణెలో నిన్న ఒక్కరోజే 1109 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఐదు రోజులుగా ఇక్కడ నిత్యం వెయ్యికి పైగా కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 4574 క్రియాశీల కేసులుండగా, 509 మందికి ఆక్సిజన్‌ సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫిబ్రవరి 21నుంచి పుణెలో రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మరో రెండు వారాలు కర్ఫ్యూ పొడగిస్తున్నట్లు పుణె అధికారులు వెల్లడించారు. రాత్రిపూట కర్ఫ్యూతోపాటు మార్చి 14వరకు పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లు మూసి ఉంటాయని ప్రకటించారు.

అమరావతిలో లాక్‌డౌన్‌ పొడగింపు..

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతున్నప్పటికీ వైరస్‌ తీవ్రత మాత్రం అదుపులోకి రావడం లేదు. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 8623కి చేరింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 72వేలు దాటింది. వైరస్‌ కట్టడి చేసేందుకు అధికారులు రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. అమరావతిలో ఇప్పటికే లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మార్చి 8వరకు లాక్‌డౌన్‌ పొడగిస్తున్నట్లు అమరావతి జిల్లా అధికారులు ప్రకటించారు. నాగ్‌పూర్‌, బుల్ధానాలోనూ వారాంతంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కొవిడ్‌ నియంత్రణ కాకుండా రాష్ట్రం మొత్తం ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని