పౌరుడిగా న్యాయపోరాటం చేస్తా: నిమ్మగడ్డ
close

తాజా వార్తలు

Updated : 31/03/2021 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పౌరుడిగా న్యాయపోరాటం చేస్తా: నిమ్మగడ్డ

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించడం తనకు సంతృప్తి కలిగించిందని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అన్నారు.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఇవాళ్టితో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ... స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు. ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేకుండా ఎన్నికలు జరిపామని, అధికారులు, సిబ్బంది ఎంతో నిబద్ధతతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించారన్నారు. సీఎస్‌, డీజీపీ సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. ప్రభుత్వం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలు, హైకోర్టు వ్యాఖ్యలు, కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా ఎస్‌ఈసీ గుర్తు చేసుకున్నారు.

 ‘‘తెలంగాణలో నాకున్న ఓటు హక్కుని రద్దు చేసుకుని ఏపీలోని మా సొంత గ్రామంలో ఓటరుగా చేరాలని దరఖాస్తు  చేసుకున్నా. అది స్థానికంగా ఉండే ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, జిల్లా అధికారి పరిధిలో ఉండే అంశం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. నా అప్పీలు జిల్లా కలెక్టర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. దీన్ని టీ కప్పులో తుఫానుమాదిరిగా సృష్టించారు. ఓటు హక్కు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. దీనికి వేరే కారణాలు ఉన్నాయని అనుకోవటం.. ఇవన్నీ అపోహలకు దారితీస్తుంటాయి. వ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచుతుంటాయి. ఇలాంటివి ఎప్పుడూ కోరుకోవటం లేదు. కోరుకోను కూడా. నేను పదవిలో ఉన్నంత కాలం ఇలాంటి వ్యక్తిగత విషయాలు పట్టించుకోలేదు... పక్కన పెట్టా. పదవీ విరమణ తర్వాత ఒక పౌరుడిగా నా హక్కు సాధించుకోవటానికి  వెనుకాడను. అవసరమైతే హైకోర్టుకు వెళ్లి  న్యాయ పోరాటం చేస్తా. దేశంలో ఒక వ్యక్తికి ఎక్కడైన ఒక చోట ఓటు వేసే హక్కు ఉంటుంది. ఏ వ్యక్తికైనా ఓటు హక్కు కల్పించనని కలెక్టరు గానీ, ఏ వ్యవస్థ అయినా అనగలుగుతుందా?. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ కాదనడానికి వీల్లేదు’’ అని నిమ్మగడ్డ అన్నారు.

వ్యవస్థలో మార్పులు రావాలి..
‘వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మంచి పద్ధతి అమలులో ఉంది. నివేదిక రూపంలో క్రోడీకరించి గవర్నర్‌కు నివేదిక అందిస్తా. అధికారిక సమాచారాన్ని నేనెప్పుడూ లీక్‌ చేయలేదు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయాలనేదే నా అభిప్రాయం. ప్రభుత్వం నుంచి నాకు పూర్తి సహకారం లభించింది. మా బాధ్యతల నిర్వహణలో హైకోర్టు సంపూర్ణ సహకారం అందించింది.  కొంతమంది అనాగరిక చర్యలు వ్యవస్థపై ప్రభావం చూపించాయి. సిబ్బందిని మూకుమ్మడి సెలవులపై పంపించే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నాం. ప్రజలు, మీడియా నుంచి అపూర్వ సహకారం అందింది’’ అని నిమ్మగడ్డ వివరించారు.

 రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. 2016 ఏప్రిల్‌ 1న ఆయన ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీ, పురపాలక, నగరపాలక, నగర పంచాయతీలకు రమేశ్‌కుమార్‌ ఎన్నికలు నిర్వహించారు. కొత్త ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్ని గురువారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని