close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. నేటి నుంచే ఆర్టీసీ వడ్డన

బస్సు ఛార్జీలు పెంచుతూ ఏపీఎస్‌ఆర్టీసీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని సర్వీసులకు కి.మీ.కు 10 పైసలు, మరికొన్నింటికి 20 పైసలు పెంచారు. ప్రైవేటు ట్రావెల్స్‌తో పోటీని తట్టుకునేందుకు వీలుగా ఏసీ బస్సుల విషయంలో కొన్ని సర్వీసులకు అసలు పెంచకపోగా, మరికొన్నింటికి 10 పైసల చొప్పున మాత్రమే పెంచారు. పెరిగిన ఛార్జీలు మంగళవారం అర్ధరాత్రి తొలి సర్వీసు నుంచి అమల్లోకి వస్తాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత అన్ని రకాల బస్సు ప్రయాణికులకు వడ్డించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సి48

శ్రీహరికోటలో ఉన్న షార్‌ కేంద్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి 48 వాహకనౌకను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.25కు నింగిలోకి పంపనున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి48 వాహకనౌక మనదేశానికి చెందిన రీశాట్‌-2బీఆర్‌1తో పాటు విదేశాలకు చెందిన 9ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. సన్నబియ్యం ఇస్తామనలేదు

ప్రజలు తినగలిగిన, నాణ్యమైన స్వర్ణతో పాటు, అలాంటి ఇతర రకాల బియ్యం సరఫరా చేస్తామని మాత్రమే తాను గతంలో చెప్పానని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందంటూ ‘సాక్షి’ పత్రికలో తప్పుగా రాశారని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

4. హెరిటేజ్‌ ఫ్రెష్‌ నాదని నిరూపిస్తే రాజీనామా

‘‘హెరిటేజ్‌ ఫ్రెష్‌ నాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమేనా?’’ అని తెదేపా నేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి సవాలు విసిరారు. శాసనసభలో సీఎం మంగళవారం మాట్లాడుతూ..చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ ద్వారా కిలో ఉల్లి రూ.200కు విక్రయిస్తున్నారన్నారు. చంద్రబాబు స్పందిస్తూ..‘‘హెరిటేజ్‌ ఫ్రెష్‌ మాది కాదు, విక్రయించేశాం. ఆ సంస్థ మాదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే మీరు చేయాలి. భారతి సిమెంట్‌, సండూర్‌ పవర్‌ సంస్థల మాటేమిటి?’’ అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఖర్చులకు కళ్లెం

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఖర్చుల నియంత్రణ, నీటిపారుదల రంగంలో కొత్త అభివృద్ధి పనులు తదితర అంశాల ఎజెండాతో బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, ఖర్చులను బాగా తగ్గించాలని మంత్రులు, అధికారులను కోరనున్నట్లు సమాచారం. ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఆంక్షలను విధించే వీలున్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. సంక్రాంతి తర్వాతే పురపోరు

తెలంగాణలో సంక్రాంతి తర్వాతే పురపాలక ఎన్నికల సందడి మొదలు కానుంది. వార్డుల పునర్విభజన మరో వారం రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. మొదట ఎన్నికల ముందస్తు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అనంతరం అభ్యంతరాలను స్వీకరించి వార్డుల తుది జాబితాలను ప్రచురిస్తారు. ఈ ప్రక్రియకు కనీసం పది, పదిహేను రోజుల సమయం అవసరమని అధికారులు అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. శీతాకాల విడిదికి రాష్ట్రపతి కోవింద్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం తెలంగాణకు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు... ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు ఆయన హైదరాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిదికి రావడం ఆనవాయితీగా ఉంది. ఈనెల 21న ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న ఆయన 22 నుంచి 26 వరకు కేరళలో పర్యటిస్తారని సమాచారం. 27న నగరంలో ఉండి 28న దిల్లీకి పయనమవుతారు. పూర్త వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మహిళలపై నేరాల కేసుల్లో 76 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు

దేశంలో 76 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. ఈ కేసులున్న వారి సంఖ్య భాజపా (21)లో ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్‌(16), వైకాపా(7)లు ఉన్నాయి. గత ఐదేళ్లలో (2014-2019) జరిగిన ఎన్నికల్లో.. అన్ని పార్టీల్లో, అన్ని రాష్ట్రాల్లో కలిపి స్వతంత్రులతో సహా ఇలాంటి కేసులున్న ఎంపీలు, ఎమ్మెల్యేల గణాంకాలను ఏడీఆర్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి

అమెరికాలో తుపాకీ విష సంస్కృతి మరోసారి రెక్కలు విప్పింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలో పోలీసులకు దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు అనుమానిత నిందితులు సహా ఓ పోలీసు ఉన్నతాధికారి ఉన్నారు. మరో ఇద్దరు పోలీసు అధికారులు, ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని నిత్యావసర సరకుల దుకాణంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. చరిత్ర సృష్టించిన భారత్‌

దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 312 (174 స్వర్ణ, 93 రజత, 45 కాంస్యాలు) పతకాలు సాధించి అగ్రస్థానంతో టోర్నీని ముగించింది. ఈ పోటీల చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. దీంతో 2016లో గువాహటితో జరిగిన పోటీల్లో మన బృందం 309 పతకాలతో (189 స్వర్ణ, 90 రజత, 30 కాంస్యాలు) నెలకొల్పిన రికార్డు బద్దలైంది. మరోవైపు సవత్తరంగా సాగుతున్న భారత్‌-వెస్టిండీస్‌ టీ20 పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో తలో మ్యాచ్‌ నెగ్గగా.. బుధవారం నిర్ణయాత్మక మూడో టీ20 ముంబయిలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.