close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం

దిశపై హత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పుర్కర్‌ నేతృత్వంలో బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌, సీబీఐ మాజీ అధిపతి డి.ఆర్‌.కార్తికేయన్‌ సభ్యులుగా న్యాయ విచారణ సంఘాన్ని నియమించింది. ప్రారంభించిన నాటి నుంచి ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని పేర్కొంది. భిన్న వాదనల నేపథ్యంలో ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌  చేయండి 

2. సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లు-2019కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం రాత్రి ఆమోదం తెలిపారు. సోమవారం లోక్‌సభలో, బుధవారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారతదేశ పౌరసత్వం కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. రాష్ట్రపతి ఆమోదంతో ఇది ఇప్పుడు చట్టంగా మారింది. ఈ మేరకు గెజిట్‌ విడుదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఆరు నెలల పాటు 13 ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు నడుపుతున్న13 ప్యాసింజర్‌ రైళ్లను ఆరు నెలల పాటు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం ప్రకటించింది. జనవరి 1 నుంచి జూన్‌ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. వీటిలో సికింద్రాబాద్‌-మేడ్చల్‌-సికింద్రాబాద్‌, ఫలక్‌నుమా-మేడ్చల్‌-ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌-మనోహరాబాద్‌-సికింద్రాబాద్‌, ఫలక్‌నుమా-ఉందానగర్‌-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-మనోహరాబాద్‌-సికింద్రాబాద్‌, బొల్లారం-ఫలక్‌నుమా-బొల్లారం తదితర రూట్లలో తిరిగే 12 డెమూ ప్యాసింజర్‌ రైళ్లు.. ఫలక్‌నుమా-భువనగిరి-ఫలక్‌నుమా మెమూ ప్యాసింజర్‌ రైళ్లు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. జన్మభూమి, మాఊరు కమిటీల రద్దు

జన్మభూమి, మాఊరు కమిటీలను రద్దు చేస్తూ  ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఈ కార్యక్రమం అమలు, సమన్వయం నిమిత్తం పంచాయతీ, వార్డు, మండల స్థాయిలో కమిటీలు నియమిస్తూ ఇచ్చిన నాలుగు ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రణాళికశాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

5. ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్‌’..?

పుష్కరకాలం కింద (2007 డిసెంబరు 27న) విజయవాడ శివారులో హత్యకు గురైన తెనాలికి చెందిన విద్యార్థిని ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్‌’ చేయించాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహానికి ‘రీ-పోస్టుమార్టమ్‌’ చేయాలని కొద్ది నెలల క్రితం భావించారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ జరగలేదు. తాజాగా ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. డిసెంబరు 20 లోపునే ఈ ప్రక్రియ నిర్వహించనున్నారని..ఈ మేరకు సీబీఐ అధికారులు స్థానిక అధికారులను సంప్రదించారని సమాచారం.

6. ఇకనుంచి బీటెక్‌ ఆనర్స్‌

బీటెక్‌లో అత్తెసరు మార్కులతో పాసైనా.. అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైనా.. ఎవరికైనా ఇప్పటివరకు ఇచ్చేది ఒకే పట్టా. కాకపోతే ధ్రువపత్రంపై ఏ శ్రేణిలో పాసయ్యారో ప్రత్యేకంగా ముద్రిస్తారు. ఇక నుంచి ప్రతిభావంతులైన వారికి బీటెక్‌ ఆనర్స్‌ పేరిట ఇంజినీరింగ్‌ పట్టా ఇవ్వాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు, స్వయంగా ఆన్‌లైన్‌ ద్వారా నేర్చుకునే విధానాన్ని అలవాటుగా మార్చేందుకు ఇది దోహదపడుతుందని ఆచార్యులు చెబుతున్నారు. పూర్త వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పొడిగింపు

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో ఎస్సీ/ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగించడానికి తీసుకొచ్చిన బిల్లును గురువారం రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభ మంగళవారమే అంగీకారం తెలిపింది. ఇంతవరకు ఆంగ్లో-ఇండియన్లకు రిజర్వేషన్లు ఉండగా, వాటిని మాత్రం పొడిగించలేదు.

8. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఆధార్‌తో అనుసంధానం

ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఆధార్‌ కార్డు వివరాలతో అనుసంధానం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు పంపిందని ఐటీశాఖ సహాయమంత్రి సంజయ్‌ధోత్రే గురువారం రాజ్యసభకు ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. ఈ ప్రతిపాదనలు న్యాయశాఖ పరిశీలనలో ఉన్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. నిర్భయ కేసులో 17న రివ్యూ పిటిషన్‌ పరిశీలన

నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ దోషుల్లో ఒకరైన అక్షయ్‌కుమార్‌ పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను డిసెంబర్‌ 17న విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ 2017లో కోర్టు తీర్పు ఇచ్చింది. దిల్లీలో కాలుష్య తీవ్రత కారణంగా జీవిత కాలమే తగ్గిపోతుంటే మళ్లీ ప్రత్యేకంగా ఉరిశిక్ష ఎందుకంటూ నిందితుడు ఇటీవల దాఖలు చేసిన తన రివ్యూ పిటిషన్‌లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఉరిశిక్ష అమలుకు ఇద్దరు తలారీలను పంపాలని ఉత్తర్‌ప్రదేశ్‌ జైళ్ల అదనపు డైరెక్టర్‌ జనరల్‌ను తిహార్‌ జైలు అధికారులు కోరారు.

10. మరో రష్యా కావొద్దు..!

ఎన్ని చర్యలు తీసుకున్నా మన దేశంలో డోపీల సంఖ్య ఏటికి ఏడూ పెరుగుతూనే ఉంది. డోపింగ్‌ ఉల్లంఘనల్లో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది 150 మందికి పైగా భారత అథ్లెట్లు డోప్‌ పరీక్షల్లో విఫలమయ్యారు. ఇంకా చాలామంది నిశిత పరిశీలనలో ఉన్నారు. నిబంధనలు, శిక్షలు అంతకంతకూ కఠినతరం చేస్తున్నా.. అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా.. డోపింగ్‌ తగ్గకపోగా ఇంకా పెరుగుతుండటం ఆందోళన కలిగించేదే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.