close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. అమెరికాలో కాల్పులు: ఆరుగురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన నిందితుడితో సహా ఆరుగురు మృతి చెందారు. మిల్‌వాకీ నగరంలోని మెల్సన్‌ కూర్స్‌ బీర్ల కంపెనీలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారంసాయంత్రం 6గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 51 ఏళ్ల వ్యక్తి మెల్సన్‌ కూర్స్‌ కంపెనీలోకి చొరబడి ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరణ

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు గురువారం విశాఖపట్నంలో నిర్వహించనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్యయాత్రకు వెళుతూ చంద్రబాబు మార్గమధ్యలో పెందుర్తి మండలంలో భూసమీకరణ బాధితులతో మాట్లాడాల్సి ఉంది. ఉదయం 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఎందుకింత అసమర్థత?

ప్రభుత్వ, ప్రజలకు చెందిన బహిరంగ ప్రదేశాల్లో అనుమతుల్లేకుండా ప్రార్థనా మందిరాలను నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రార్థనా మందిరాల పేరుతో అక్రమ నిర్మాణాలకు సంబంధించి 2010లో జీవో జారీ అయినా అవి కొనసాగుతూనే ఉంటే కళ్లు మూసుకున్నారా? అంటూ ప్రశ్నించింది. మతపరమైన స్వేచ్ఛ పేరుతో ఇలా అక్రమ నిర్మాణాలను అనుమతించడానికి అంగీకరించబోమని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రాజధాని పనులు.. హైకోర్టు తరలింపుపై వివరాలివ్వండి

ఏపీ రాజధాని పరిధిలో అభివృద్ధి పనుల కొనసాగింపు, హైకోర్టు తరలింపు వివరాలు తెలియజేయాలని.. దీనిపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంతో ముడిపడి ఉన్న వ్యాజ్యాల విచారణను మార్చి 17కి వాయిదా వేసింది. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లు, జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ), హైపవర్‌ కమిటీ నివేదికలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లోనూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మేడారం జాతర ఆదాయం  రూ.11.64 కోట్లు

మేడారం జాతరలో భాగంగా ఏర్పాటుచేసిన హుండీల ఆదాయం లెక్కింపు ప్రక్రియ బుధవారంతో పూర్తి అయింది. మొత్తం రూ.11,64,61,774 ఆదాయం సమకూరినట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ రామల సునీత, మేడారం దేవాలయ కార్యనిర్వహణ అధికారి రాజేంద్రం విలేకరులకు తెలిపారు. దీంతోపాటు 1.064 కిలోల బంగారు కానుకలు, 53.45 కిలోల వెండి ఆభరణాలు వచ్చాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. అమ్మ.. నాన్న పుట్టిందెక్కడ?

‘మీ అమ్మ, నాన్నల పేర్లేమిటి.. ఎక్కడ పుట్టారు.. వారిద్దరి పుట్టిన తేదీలు ఏమిటి.. అనే ప్రశ్నలకు ప్రతి భారతీయ పౌరుడు సమాధానాలు చెప్పాలి. వీటితో సహా మొత్తం 23 ప్రశ్నలకు కుటుంబం వివరాలన్నీ ‘జాతీయ జనాభా పట్టిక’(నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌- ఎన్‌పీఆర్‌)లో పక్కాగా నమోదు చేయాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో ప్రతి రాష్ట్రంలో 45 రోజుల పాటు జనగణన మొదటి దశ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. రారండోయ్‌.. రాయితీలిస్తాం

త్వరలో బీఎస్‌-4 వాహనాలకు కేంద్రం మంగళం పాడుతున్న నేపథ్యంలో వాటిని విక్రయించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆయా కంపెనీలు ఉన్న నిల్వలను వదిలించుకునేందుకు ద్విచక్రవాహనాలకు రూ.10 వేల వరకు, కార్లకు రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు రాయితీలు ఇస్తున్నాయి. హై ఎండ్‌ కార్ల విషయంలో ధర తగ్గింపు మరింత ఎక్కువగా ఉంది. మార్చి 31వ తేదీకి బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కావాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. సాయ్‌ శిబిరానికి కంబళ వీరుడు శ్రీనివాసగౌడ

కర్ణాటక కంబళ వీరుడు శ్రీనివాసగౌడ ఎట్టకేలకు భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్‌) శిక్షణ శిబిరానికి హాజరయ్యేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల చివరి వరకు కంబళ పోటీలు జరగనున్నాయి. అనంతరం శ్రీనివాస గౌడ బెంగళూరు సాయ్‌ ఆధ్వర్యంలోనే ప్రాథమిక శిక్షణ తీసుకునేందుకు ఒప్పందం కుదిరింది. వంద మీటర్ల కంబళ మళ్లను 9.55సెకన్లలో అధిగమించిన శ్రీనివాసగౌడను ఉసేన్‌బోల్ట్‌తో పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు హల్‌చల్‌ చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. గంటకు రూ.7 కోట్లు

ప్రపంచ ధనవంతుల జాబితాలోని తొలి పది స్థానాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వరుసగా రెండోసారీ స్థానం దక్కించుకున్నారు. 2019కి సంబంధించి హురూన్‌ విడుదల చేసిన తొమ్మిదో విడత ‘అంతర్జాతీయ ధనవంతుల జాబితా 2020’లో ఆయన సంపద 13 బిలియన్‌ డాలర్లు పెరిగి, 67 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.4.8 లక్షల కోట్లు) చేరడంతో 9వ స్థానంలో నిలిచారు. దీని ప్రకారం, ఆయన గంటకు రూ.7 కోట్లు సంపాదిస్తున్నట్లు లెక్క తేల్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. గెలిస్తే సెమీసే

మహిళల టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌ మరో కీలక సమరానికి సిద్ధమైంది. పటిష్ఠమైన న్యూజిలాండ్‌తో మరికాసేపట్లో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన టీమ్‌ఇండియా.. కివీస్‌తో పోరులో విజయం సాధించి ముందుగానే సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలో దిగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.