close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/07/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. సగం పడకలు సర్కారుకే

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని కొవిడ్‌ పడకల్లో సగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పర్యవేక్షణలోకి తీసుకోనుంది. వాటి కేటాయింపులో పారదర్శకత కోసం ఒక యాప్‌ను తీసుకురానుంది. దీనివల్ల ఏ ఆసుపత్రిలో ఎన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో తెలిసిపోతుంది. సర్కారు నిర్దేశించిన ధరలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలనుకునే వారు.. ఈ యాప్‌ ద్వారా పడకలను పొందవచ్చు. మిగిలిన 50 శాతం బెడ్లను ఆసుపత్రుల యాజమాన్యాలు తమ ఇష్టానుసారం కేటాయించుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. సౌర విద్యుత్‌ నగరంగా బెజవాడ!

సౌర విద్యుత్‌ నగరంగా మార్చేందుకు విజయవాడను కేంద్రం ఎంపిక చేసింది. ప్రతి ఇంటికి అవసరమైన విద్యుత్‌ కోసం ఏర్పాటు చేసే సౌర పలకలపై 40శాతం రాయితీ ఇవ్వనుంది. నగర పరిధిలోని వాణిజ్య భవనాలకూ ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించనుంది. ఇది విజయవంతమైతే దశలవారీగా మిగిలిన పట్టణాలకూ విస్తరించాలన్న ప్రతిపాదన ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ముప్పు ముంగిట 3వ స్థానం

దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 6.73 లక్షలు దాటింది. మరొక్కరోజులో రష్యా(6.81 లక్షలు)ను దాటి.. అత్యధిక కేసులున్న దేశాల జాబితాలో మన దేశం మూడో స్థానానికి చేరడం దాదాపు ఖాయమే! ఈ జాబితాలో అమెరికా(29 లక్షలకు పైగా), బ్రెజిల్‌(15 లక్షలకు పైగా) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కేరళ తొలి గంట కొట్టింది!

కరోనా కల్లోలంతో విద్యార్థులంతా బడులకు దూరమైన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వినూత్నంగా ‘తొలి గంట’ కొట్టింది. దేశంలోనే ప్రప్రథమంగా అందరికీ అందుబాటులో ఆన్‌లైన్‌ విద్యాబోధనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే కాదు.. దేశ, విదేశాల్లో ఉంటున్న 40 లక్షల మంది విద్యార్థులు రోజూ ఈ-తరగతుల ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘చిల్లర’ శ్రీమహాలక్ష్మి

తెలంగాణలో చిల్లర వర్తకం (రిటైల్‌) లాభసాటిగా మారడంతో ప్రసిద్ధ బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులతో దుకాణాలను ప్రారంభించేందుకు ముందుకొస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ విధానాలకు తోడు అనుకూల పరిస్థితులతో ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వీటి కోసం ప్రత్యేక విధానం సిద్ధం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కాలు కదపరు.. కాల్‌ చేయరు!

హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో ఎటువంటి లక్షణాలు లేని సగం మంది హోంఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీరిలో వందలాది మందికి వైద్య ఆరోగ్య శాఖ నుంచి సకాలంలో సలహాలు, సూచనలు, ఫోన్‌ చికిత్స లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో చేరాలా ఇంట్లోనే ఉండాలా తెలియక సతమతమవుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 16 వేలకు పైబడి కరోనా కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కొలువుదీరగ రా..రండి

కరోనా కారణంగా మార్చిలో పలు సంస్థలు ప్రాంగణ నియామకాలను నిలిపివేశాయి. కానీ కేంద్ర మానవ వనరుల శాఖ సైతం మరోసారి నియామకాలను చేపట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థల్లో కొలువులకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థులు ఆందోళన చెందారు. తాజాగా ఐటీ కంపెనీల నుంచి వస్తున్న సమాచారం అభ్యర్థులకు ఊరటనిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఆరు వారాల్లో వ్యాక్సిన్‌ రావడం కష్టమే

ఐసీఎంఆర్‌ ప్రకటించినట్లు ఆరు వారాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం కష్టమని దిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌సింగ్‌ గులేరియా పేర్కొన్నారు. మనుషులపై ప్రయోగాలు నిర్వహించి అది సురక్షితమైందా? కాదా? అని నిర్ధారించుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. సింగపూర్‌ వేదికగా అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం

‘శ్రీ సాంస్కృతిక కళాసారధి’ సంస్థ ఆవిర్భావం సందర్భంగా సింగపూర్‌ వేదికగా ఆదివారం అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం నిర్వహించారు. 14 దేశాలకు చెందిన 50 మంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు వక్తలుగా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశం పంపించగా.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ సంస్థ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. హైడ్రాక్సి క్లోరోక్విన్‌పై ప్రయోగం నిలిపివేత

కొవిడ్‌-19 బాధితులకు హైడ్రాక్సి క్లోరోక్విన్‌ ఉపయోగపడుతుందా అన్నది తేల్చే ప్రయోగాలను ముగించాలని నిర్ణయించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ ఔషధంతోపాటు లోపినావిర్‌/రిటోనావిర్‌లపై ప్రయోగాలనూ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ ఔషధాలు ఇచ్చిన బాధితుల్లో మరణాలు పెరుగుతున్నాయనడానికీ ‘గట్టి ఆధారాలు’ లేవని తెలిపింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.