
తాజా వార్తలు
భారత్ టీకాలు: కొత్తరకాలపై పనిచేస్తాయా..?
దిల్లీ: ప్రమాదకరమైనవిగా అనుమానిస్తున్న కొత్తకరం కరోనా వైరస్లు భారత్‌లో వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించిన విషయం తెలిసిందే. బ్రిటన్ రకం కరోనాపై ప్రస్తుతం భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు పనిచేస్తాయని ఇప్పటికే వెల్లడైంది. కానీ, తాజాగా దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాలపై భారత్ వ్యాక్సిన్లు పనిచేస్తాయా? లేదా? అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. అయితే, వీటిని నిర్ధారించేందుకు ఇప్పటివరకు సరైన డేటా లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
దేశంలో నలుగురిలో దక్షిణాఫ్రికా వేరియంట్, మరొకరిలో బ్రెజిల్ రకం వైరస్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మధ్యే ధ్రువీకరించింది. ఇక బ్రిటన్ రకానివి 187 కేసులు బయటపడినట్లు తెలిపింది. అయితే, ఇప్పటివరకు భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండు టీకాలు బ్రిటన్ రకం వైరస్‌ను సమర్థంగానే ఎదుర్కొంటున్నట్లు ఆయా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు వెల్లడించాయి. కానీ, తాజాగా వెలుగుచూసిన దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాలపై ఇవి పనిచేస్తాయా? లేదా అనే విషయం శాస్త్రవేత్తల పరిశోధన పూర్తయ్యే వరకు చెప్పడం కష్టమేనని యూపీలోని శివ్‌నాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దీపక్ సెహగల్ పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం బ్రిటన్ రకం వైరస్‌లో ఇప్పటివరకు ఒకే మ్యుటేషన్ జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాల్లో మాత్రం ఇప్పటికే చాలా మ్యుటేషన్లు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఫైజర్, మోడెర్నాలు బ్రిటన్, దక్షిణాఫ్రికా రకాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్లు ఈ మధ్యే ప్రకటించాయి. ఇక రష్యాకు చెందిన స్పుత్నిక్, చైనా వ్యాక్సిన్లు కొత్తరకాలపై పనిచేస్తాయా? లేదా అనే విషయంపైనా క్లారిటీ లేదు.ఇక భారత్‌లో అనుమతి పొందిన కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లు బ్రిటన్ రకాన్ని ఎదుర్కొంటున్నట్లు స్పష్టంచేసినప్పటికీ తాజాగా వెలుగుచూసిన కొత్తరకాలపై పరిశోధనలు పూర్తయ్యేవరకూ అప్రమత్తంగానే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.