
తాజా వార్తలు
అది భాజపా టూల్‌కిట్: కాంగ్రెస్
దిల్లీ: ఉత్తరాది ప్రజలను రాహుల్ గాంధీ తక్కువ చేసి మాట్లాడారంటూ భాజపా నేతలు చేసిన విమర్శల్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఆ పార్టీ కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని తప్పుబట్టింది. ఉత్తర- దక్షిణ అంటూ కొత్త టూల్ కిట్‌ను ప్రయోగిస్తోందంటూ ఆరోపించింది. ఇటీవల ‘టూల్‌కిట్’ అంశం ప్రధానంగా మారిన వేళ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా భాజపాపై వ్యంగ్య బాణాలు సంధించారు.
కేరళలో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. తాను 15 ఏళ్లు ఉత్తరాదిన ఎంపీగా ఉన్నానని, అక్కడి రాజకీయాలు భిన్నంగా ఉంటాయన్నారు. కేరళలో మాత్రం కొత్తగా అనిపిస్తుందని, ఇక్కడి ప్రజలు సమస్యలపై పూర్తి ఆసక్తి, అవగాహనతో ఉంటారని అన్నారు. దీనిపై భాజపా నేతలు విమర్శలు గుప్పించారు. రాహుల్ పచ్చి అవకాశవాది అని, ఉత్తరాది ప్రజలను కించపర్చారని జేపీ నడ్డా, స్మృతీ ఇరానీ, కిరణ్ రిజిజు, హర్దీప్సింగ్ పూరీ, జైశంకర్ తదితర నేతలు విమర్శలు గుప్పించారు.
భాజపా విమర్శలపై సూర్జేవాలా స్పందించారు. సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయాలని ప్రజలకు రాహుల్ సూచించారని తెలిపారు. కానీ, దేశంలో కీలకమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు భాజపా నేతలు రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. జీడీపీ క్షీణత, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు కుదేలు వంటి అంశాలను వదిలేసి పసలేని అంశాలను పట్టుకుని ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది ఆందోళన చేస్తున్నా.. వారిలో 250 మంది మరణించినా వారి గోడు వినేందుకు భాజపా ప్రభుత్వానికి తీరిక లేదని విమర్శించారు. ఓ వైపు రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ.. వాటిపై చర్చించేందుకు ప్రజలు దృష్టి సారించకుండా ‘టూల్‌కిట్’ ప్రయోగిస్తున్నారని సూర్జేవాలా మండిపడ్డారు.