
తాజా వార్తలు
ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు సిద్ధం: వాట్సాప్
న్యూదిల్లీ: తమ ప్రైవసీ పాలసీ గురించి ప్రభుత్వం అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వాట్సాప్ తెలిపింది. భారత్‌లో వాట్సాప్ వినియోగిస్తున్న వారందరి ఖాతాల ప్రైవసీ, సెక్యురిటీకి కట్టుబడి ఉన్నామని సంస్థ ఉన్నతాధికారి క్యాచ్కార్ట్ తెలిపారు. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
వాట్సాప్ సమాచారం ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకునేందుకు వీలుగా ప్రైవసీ పాలసీని మార్చిన తరుణంలో వినియోగదారులు ఇతర సామాజిక మాధ్యమాల వైపునకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే గతకొన్ని రోజులుగా సిగ్నల్, టెలిగ్రామ్‌ల డౌన్లోడ్లు గణనీయంగా పెరగడం గమనార్హం. ‘వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనేందుకు ప్రస్తుత ప్రపంచంలో పోటీ ఉన్న సంగతి తెలిసిందే. గోప్యత ఉన్నప్పుడే అది వస్తుంది. ప్రజలు సమాచారాన్ని ఎలా పంచుకోవాలనే విషయంలో పూర్తి స్వేచ్ఛ వారికి ఉండాలి. అదే సమయంలో తమ సంభాషణలు ఎవరూ చూడకూడదని అనుకుంటారు’ అని క్యాచ్కార్ట్ వివరించారు.
తమపై నమ్మకం ఉంచి, సమాచారం పంచుకునేందుకు వాట్సాప్ వినియోగిస్తున్న వారికి కార్ట్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నమ్మకమే భవిష్యత్‌లో యాప్‌ను మరింత భద్రంగా తీర్చిదిద్దేందుకు తమకు సహాయపడుతుందని అన్నారు. గతంలోనూ సమాచారం దుర్వినియోగం అవుతుందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ పలు కఠిన చర్యలు తీసుకుంది.