ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం 
close

తాజా వార్తలు

Updated : 21/03/2021 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం 

నల్గొండ: తెలంగాణలో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోరులో అధికార తెరాస సత్తా చాటింది. ఇప్పటికే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానంలో మాజీ ప్రధాని పీవీ కుమార్తె విజయం సాధించగా, తాజాగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్గొండ-ఖమ్మం- వరంగల్‌ స్థానం నుంచి గెలుపొందారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో విజయం కోసం అభ్యర్థులు దాదాపు నాలుగు రోజులు వేచిచూడాల్సి వచ్చింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి జరిగిన పోరులో అధికార తెరాస తరఫున పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచారు. పల్లారాజేశ్వర్‌రెడ్డికి 1,61,811 ఓట్లు రాగా, తీన్మార్‌ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి. దీంతో 12,806 ఓట్ల మెజారిటీతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. ఓట్ల లెక్కింపు అనంతరం పల్లా రాజేశ్వర్‌రెడ్డికి జిల్లా కలెక్టర్‌ రౌండ్ల వారీగా వచ్చిన ఓట్ల వివరాలను అందించారు. ఆదివారం ఈసీ నుంచి ధ్రువపత్రం రాగానే పల్లాకు కలెక్టర్‌ అందజేయనున్నారు. ఇక రెండు స్థానాల్లోనూ తెరాస అభ్యర్తులు గెలవడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు పల్ల విజయంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికైన పల్లాను సీఎం అభినందించారు. పల్లా గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను కేసీఆర్‌ అభినందించారు. పల్లాను గెలిపించిన పట్టభద్రులు, ఉద్యోగులకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో అభ్యర్థుల మధ్య పోటీ ఆది నుంచి ఉత్కంఠగా సాగింది. అయితే తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొదటి నుంచీ ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థి గెలుపునకు  50  శాతానికి పైగా మెజారిటీ రాకపోవడంతో తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కో అభ్యర్థిని తొలగించుకుంటూ రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇక ఈ స్థానం నుంచి మొత్తం 71 మంది బరిలో నిలిచారు. మొత్తం 5,05, 565 ఓట్లు ఉండగా, 3,87,969 ఓట్లు పోలైనవి. వీటిలో 3,66,333 చెల్లినవి కాగా, 21,636 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్లలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,11,812 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 84,118 ఓట్లు, తెజస తరఫున పోటీచేసిన ప్రొఫెసర్‌ కోదండరాంకు 71,126, భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి 39,306, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,729 ఓట్లు వచ్చాయి. 

ముగిసిన అతిపెద్ద సుదీర్ఘ ఓట్ల లెక్కింపు
రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించింది. ఓట్ల లెక్కింపు పూర్తికావడానికి దాదాపు నాలుగు రోజుల సమయం పట్టింది. 90 గంటల పాటు కౌంటింగ్‌ జరిగింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపులో 50 మంది సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ప్రతి రోజూ మూడు విడతలవారీగా ఎనిమిది వందల మంది లెక్కింపు సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి జరిగిన లెక్కింపులో కూడా ఇదే స్థాయిలో సిబ్బంది పాల్గొన్నారు.  

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని