పినరయి.. రయ్‌..రయ్‌.
close

తాజా వార్తలు

Published : 02/05/2021 20:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పినరయి.. రయ్‌..రయ్‌.

కేరళలో గత నాలుగు దశాబ్దాలుగా ఉన్న రికార్డు బద్దలైంది. ప్రతి అసెంబ్లీ ఎన్నికలకు అధికారాన్ని మార్చే ఓటర్లు ఈ సారి విలక్షణమైన తీర్పు ఇచ్చారు. అధికారంలో ఉన్న వామపక్షకూటమికే  మళ్లీ పట్టం కట్టారు. బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో బలహీనపడి విపక్షంగా ఉన్న వామపక్షకూటమికి ఈ గెలుపు మళ్లీ ఉత్సాహన్ని ఇచ్చిందనే చెప్పాలి. ప్రతి ఎన్నికకు ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ల మధ్య మారే అధికార పీఠానికి భిన్నంగా వరుసగా రెండోసారి సీపీఎం సారథ్యంలోని వామపక్షకూటమి  అధికారాన్ని నిలబెట్టుకోవడం విశేషం. సీఎం పినరయి విజయన్‌ ఈ విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా విలయతాండవం, కాంగ్రెస్‌, భాజపాల దాడి, శబరిమల అంశం.. తదితర ప్రతికూల అంశాలు వెంటాడినా చాకచక్యంగా అధికారాన్ని పదిలం చేసుకున్నారు.

నారికేళ సీమలో ఎర్రజెండా విజయానికి దోహదం చేసిన అంశాలివే..

సంక్షేమ పథకాలు

కేరళలో సంక్షేమ పథకాలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం శ్రద్ధవహించింది.  పథకాలను గ్రామస్థాయిలోని పేదలకు చేరేలా వామపక్ష శ్రేణులు కీలకంగా వ్యవహరించాయి. కరోనా సమయంలో ప్రవేశపెట్టిన  ఆహార సరఫరా ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్యోగుల జీతభత్యాలను పెంచారు.

కరోనాను ఎదుర్కోవడం..

దేశంలో తొలి కరోనా కేసు కేరళలోనే నమోదైంది. అప్పటికే నిఫా వైరస్‌అనుభవంతో  కరోనా నియంత్రణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. 

పెట్టుబడుల ప్రవాహం

కేరళలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది.  కేరళ మౌలిక సౌకర్యాల నిధుల సంస్థ నుంచి ఈ ఐదేళ్లలో దాదాపు రూ.50 వేల కోట్ల నిధులు రాష్ట్రంలోకి వచ్చాయి.  ఈ నిధులతో మౌలిక సౌకర్యాలైన రహదారులు, వంతెనలు, విద్యాసంస్థలను భారీ ఎత్తున నిర్మించారు. 

స్థానిక ఎన్నికల్లో విజయోత్సాహం

అసెంబ్లీ ఎన్నికలకు కొంతకాలం ముందే నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో అధికారిక వామపక్ష కూటమి ఘనవిజయాలు నమోదుచేసింది. ఈ ఉత్సాహంతో వామపక్షశ్రేణులు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాయి.

కేరళ కాంగ్రెస్‌తో పొత్తు

మధ్య కేరళలోని పత్తినంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, అలపుళ, ఎర్నాకుళం ..తదితర జిల్లాల్లో కేరళ కాంగ్రెస్‌ప్రభావం ఎక్కువ. కేరళ కాంగ్రెస్‌నేత జోస్‌ మణి వర్గంతో పొత్తు పెట్టుకోవడం కలసివచ్చిందనే చెప్పాలి.

శబరిమల అంశం

శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం ఎల్డీఎఫ్‌ కూటమి దూకుడుగా వెళ్లింది. దీంతో హిందూ సంఘాల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు గానూ కేవలం ఒక్కస్థానం మాత్రమే వామపక్షకూటమికి దక్కింది. మతపరమైన ఉద్వేగమైన అంశాలపై దూకుడుగా వెళ్లకూడదని కూటమి నిర్ణయించింది. దీంతో పాటు శబరిమల అంశంపై విచారం వ్యక్తం చేయడంతో ఓటర్లు తిరిగి ఎల్డీఎఫ్‌ వైపు మొగ్గు చేపారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని