
తాజా వార్తలు
హైదరాబాద్ చేరుకున్న మోదీ
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించేందుకు మూడు నగరాల పర్యటనలో భాగంగా ప్రధాని హకీంపేట వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైడస్ క్యాడిలా బయోటెక్ పార్క్‌ను సందర్శించారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట చేరుకున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా నగరశివార్లలోని జినోమ్‌వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థకు వెళ్తారు. ఈ సంస్థ ‘కొవాగ్జిన్’ పేరుతో టీకాను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మూడో దశ క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయి. మోదీ ఆ సంస్థలో కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తిని పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు. భారత్ బయోటెక్ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో మాట్లాడతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.