close

తాజా వార్తలు

Published : 06/04/2021 21:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

5రాష్ట్రాల ఎన్నికలు: 475 స్థానాల్లో ముగిసిన పోలింగ్‌!

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి
పశ్చిమ బెంగాల్‌లో మరో ఐదు విడతల్లో పోలింగ్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో నేడు జరిగిన 475 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ పూర్తయ్యింది. పశ్చిమబెంగాల్‌, అస్సాంలో కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా అన్ని చోట్ల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. కొవిడ్‌తో పాటు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఐదు రాష్ట్రాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో పోలింగ్‌ బూత్‌ల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపించాయి. తమిళనాడు మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ 70శాతం దాటింది. పశ్చిమ బెంగాల్‌లో నేడు మూడో దశ పోలింగ్‌ జరగగా.. తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. వీటితో పాటు కేరళ(మలప్పురం), తమిళనాడు(కన్యాకుమారి) ఒక్కో చోట పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఐదు రాష్ట్రాల్లో మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

అస్సాం: భారీగా తరలివచ్చిన ఓటర్లు..

అస్సాంలో తుది దశలో భాగంగా నేడు 40శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా..337మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 8గంటల వరకు ఇక్కడ 82.33శాతం పోలింగ్‌ జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నేడు ఆఖరి విడత పోలింగ్‌ జరగడంతో అస్సాంలో అన్ని స్థానాలను ఎన్నికలు పూర్తయ్యాయి. భాజపా మంత్రులు హిమంత బిశ్వశర్మ, చంద్ర మోహన్‌ పఠోవారీ, సిద్ధార్ధ బట్టాచార్య, ఫణిభూషణ్‌ చౌధురీ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు మాస్కులు, చేతికి ప్లాస్టిక్‌ గ్లౌజులను ఎన్నికల సిబ్బంది అందించారు.

కేరళలో 70.48శాతం..

కేరళలో 140అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకేవిడతలో జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 8గం.వరకు ఇక్కడ 70.48శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2.74కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 70శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాలిపరంబా, ధర్మదామ్‌, అనూర్‌, చేర్తాలా, వాడక్కంచెర్రీ, కరుణగపళ్లీ నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్‌ నమోదయ్యింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితల, సీనియర్‌ కాంగ్రెస్ నేత ఊమెన్‌ చాందీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌, మెట్రోమ్యాన్‌ ఇ.శ్రీధరన్‌, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తమిళనాడులో 65.68శాతం..

తమిళనాడులో ఒకేదశలో నేడు 234 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 8గంటల వరకు ఇక్కడ 65.68శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని.. పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో 77.68శాతం..

పశ్చిమ బెంగాల్‌ మూడో దశలో భాగంగా నేడు 31అసెంబ్లీ స్థానాలను పోలింగ్‌ జరిగింది. ఇక్కడ 77.68శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మునుపటి లాగే పలు చోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావారణం చోటుచేసుకుంది. కొన్ని పోలింగ్ బూత్‌ వద్ద తృణమూల్‌ నేతలపై భాజపా కార్యకర్తలు దాడులు చేస్తున్నారని.. ఇలాంటి ఫిర్యాదులు వంద వరకు వచ్చాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మూడో విడతలో 31 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. 205మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిక్షిప్తం చేశారు. మరో ఐదు విడతల్లో అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి.

పుదుచ్చేరిలో 80.67శాతం..

పుదుచ్చేరి అసెంబ్లీలోని మొత్తం 30స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్ జరగగా 80.67శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, భాజపా పుదుచ్చేరి అధ్యక్షుడు వీ స్వామినాథన్‌, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌ రంగస్వామి వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని