close

తాజా వార్తలు

Updated : 06/04/2021 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మధ్యాహ్నం 3 గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సరళి ఇలా..

దిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, బెంగాల్‌ అస్సాంతోపాటు  కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌ మినహా మిగతా చోట్ల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. బెంగాల్‌లో మాత్రం పలుచోట్ల భాజపా, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్‌ ప్రభావం, ఎండ తీవ్రత ఉన్నప్పటికీ తక్కిన రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలింగ్‌ బూత్‌ల వద్ద పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఐదు రాష్ట్రాల్లో ఓటింగ్‌ సరళి ఇలా ఉంది.

తమిళనాడులో 42.7 శాతం

తమిళనాడులో ఒకేదశలో మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 42.7 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పోలింగ్‌ సజావుగా కొనసాగుతున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు. ఎన్నికలు జరుగుతోన్న మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో పోలింగ్‌ కాస్త మందకొడిగానే సాగుతోంది.

కేరళలో 52 శాతం

కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఇక్కడ 52 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2.74 కోట్ల మంది ఓటర్లలో సగం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాలిపరంబా, ధర్మాదమ్‌, అనూర్‌, చెర్తలా, వాడక్కంచెర్రీ, కరుణగపల్లి నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్‌ నమోదవుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితల, సీనియర్‌ కాంగ్రెస్ నేత ఊమెన్‌ చాందీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌, మెట్రోమ్యాన్‌ ఇ.శ్రీధరన్‌ తదితర ప్రముఖులు ఓటు వేశారు.

అస్సాంలో 54.43 శాతం

అస్సాంలో తుది దశలో భాగంగా 40 శాసన సభ స్థానాలకు మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 54.43శాతం మంది ఓట్లు వేశారు. ఇప్పటికే అక్కడ రెండు దశల్లో ఎన్నికల పూర్తికాగా ఇదే చివరి దశ. దాదాపు 12 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. భాజపా మంత్రులు హిమంత బిశ్వ శర్మ, చంద్ర మోహన్‌ పఠోవారీ, సిద్ధార్ధ భట్టాచార్య, ఫణిభూషణ్‌ చౌధురీ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు మాస్కులు, చేతికి ప్లాస్టిక్‌ గ్లౌజుల్ని ఎన్నికల సిబ్బంది అందిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో 54.94 శాతం

పశ్చిమ బెంగాల్‌ మూడో దశ పోలింగ్‌లో భాగంగా నేడు 31 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది. అక్కడ 54.94 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పలు చోట్ల భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద తృణమూల్‌ నేతలపై భాజపా కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ ఉదయం తమ కార్యకర్తల నుంచి ఇలాంటి ఫిర్యాదులు వంద వరకు వచ్చాయని ఎన్నికల ప్రచారంలో ఉన్న మమతా బెనర్జీ పేర్కొన్నారు.

పుదుచ్చేరిలో సగానికి పైగా..

 పుదుచ్చేరి అసెంబ్లీలోని మొత్తం 30 స్థానాలకు నేడు ఒక్కరోజే పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం మూడింటివరకు 55.66 శాతం పోలింగ్‌ నమోదైంది. పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, భాజపా పుదుచ్చేరి అధ్యక్షుడు వి.స్వామినాథన్‌, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌.రంగస్వామి తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని