
తాజా వార్తలు
ఆ పార్టీ ఎక్కడా కనిపించదేం!
ప్రకాశ్ అంబేడ్కర్ వ్యాఖ్యలు
ఔరంగాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవడంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం సహా విపక్ష పార్టీలు విఫలమయ్యాయని వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) నేత ప్రకాశ్ అంబేడ్కర్ విమర్శించారు. ఈ పార్టీలకు పక్షవాతం వచ్చిందా? అని ప్రశ్నించారు. ఈ పోరాటంలో రాహుల్ గాంధీ కనబడుతున్నా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా కానరావడంలేదని వ్యాఖ్యానించారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 27న మహారాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలుత కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. వారు వ్యాక్సిన్ షాట్ తీసుకుంటే తాను కూడా వేయించుకొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడంపైనా స్పందించారు. అసలు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు ఈ నగరంతో సంబంధమే లేదన్నారు. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేస్తుందన్న అంబేడ్కర్.. నీటి సంక్షోభం అంశాన్ని లేవనెత్తుతామన్నారు. ఎవరితోనూ పొత్తు ఉండబోదని తెలిపారు.
ఇదీ చదవండి..
సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ