
తాజా వార్తలు
కెరీర్.. అన్నింటినీ ఓర్చుకున్నా: ప్రియాంక
ముంబయి: సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని అన్నింటినీ ఓర్చుకున్నానని గ్లోబుల్ స్టార్ ప్రియాంక చోప్రా అన్నారు. సాధారణమైన నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ప్రియాంక అతి తక్కువ సమయంలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ హోదాకు ఎదిగారు. ప్రస్తుతం బాలీవుడ్-హాలీవుడ్ చిత్రాలు, సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంటోన్న ప్రియాంక ఇటీవల ‘అన్ఫినిష్డ్’ పేరుతో పుస్తక రూపంలో తన బయోగ్రఫీని మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ప్రపంచ సుందరిగా 2000 సంవత్సరంలో కిరీటాన్ని చేజిక్కించుకున్నాక నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని ప్రియాంక తన బయోగ్రఫిలో పేర్కొన్నారు. కెరీర్‌ను ఆరంభించిన కొత్తలో పలువురు దర్శకులు తనతో అసభ్యంగా మాట్లాడారని, పాట కోసం ఓ దర్శకుడు దుస్తులు తొలగించమన్నాడని, మరో దర్శకుడు అందం, శరీరాకృతికి సంబంధించిన సర్జరీలు చేయించుకోమన్నాడని పేర్కొంటూ.. ఎన్నో షాకింగ్ విషయాలను ఆ పుస్తకంలో ప్రియాంక వివరించారు.
‘అన్ఫిన్షిడ్’లో భాగంగా తాను చేసిన ఆరోపణల గురించి తాజాగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కెరీర్ కోసమే తాను ఎన్నో కష్టాలను ఓర్చుకున్నానని ఆమె తెలిపారు. ‘కెరీర్ ప్రారంభంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేను పెదవి విప్పి చెప్పలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండాలి కాబట్టి. పరిశ్రమలో నిలదొక్కుకోవడం కోసం చిరునవ్వుతో అన్నింటిని ఓర్చుకుని నా పని నేను చేసుకునేదాన్ని. ఎందుకలా చేశానంటే.. నాకెన్నో భయాలున్నాయి. నాలో అభద్రతాభావం ఎక్కువగా ఉండేది. అందుకే ఎవరేమన్నా పట్టించుకోకుండా నా పని నేను పూర్తి చేసుకున్నాను’’ అని ప్రియాంక చోప్రా వివరించారు.