close

తాజా వార్తలు

Updated : 14/02/2020 10:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉగ్ర సర్పాన్ని ఊరికే వదలబోము..!  

పుల్వామా విషాదానికి నేటితో ఏడాది

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేక కథనం

పుల్వామా వద్ద 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న ఆత్మాహుతి దాడి అనంతరం దేశంలో పెనుమార్పులు చోటు చేసుకొన్నాయి. ఇకపై ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని భారత్‌ ప్రపంచ దేశాలకు బలమైన సందేశాన్ని పంపింది. పాక్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో సఫలమైంది. అంతేకాదు అర్ధ శతాబ్దానికి పైగా జాతి కంటిలో నలుసులా మారిన ఓ సమస్య పరిష్కారానికి ప్రధాన కారణమైంది. కశ్మీర్‌ కేంద్రంగా దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. దేశం కోసం ప్రాణాలిచ్చే దళాలకు తాము అండగా ఉంటామని రాజకీయాలకు, మతాలకు అతీతంగా జాతిమొత్తం ఏకమైంది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగి నేటికి సరిగ్గా ఏడాది. అప్పటి నుంచి తీసుకున్న చర్యలు, తెచ్చిన మార్పులు- ఉగ్రవాద నిర్మూలనలో భారత ప్రభుత్వ సంకల్ప బలాన్ని చాటుతున్నాయి. 

 

తల్లడిల్లిన భరతజాతి..

జమ్మూలో శీతాకాలం విధులను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 14న దాదాపు రెండు వేల మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది 70కిపైగా వాహనాల్లో శ్రీనగర్‌కు బయలుదేరారు. మార్గం మధ్యలో పుల్వామా వద్ద జాతీయ రహదారి ఎత్తుగా ఉండే ప్రదేశంలో సీఆర్‌పీఎఫ్‌ వాహనాల వేగం మందగించగానే ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ అనే స్థానిక ముష్కరుడు ఓ కారులో కాన్వాయ్‌ పక్కకు వచ్చి తన వాహనాన్ని పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో మొత్తం 40 మంది సీఎఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు. ప్రేమికుల దినోత్సవం నాడు చోటుచేసుకున్న ఈ ఘటన జాతి మొత్తాన్ని ఒక్కసారిగా భావోద్వేగానికి గురిచేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చిన్నచిన్న గ్రామాల్లో సైతం ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని జనం తపన పడ్డారు. సాయుధ బలగాల్లో అమర వీరుల కుటుంబాలను ఆదుకొనేందుకు కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న ‘భారత్‌ కీ వీర్‌’ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. 2018లో కేవలం రూ.19 కోట్లు ఉన్న ఈ విరాళాల మొత్తం 2019 జూన్‌ నాటికి రూ.242 కోట్లకు చేరుకొన్నాయి. అమరవీరుల కోసం జాతి ఎంతగా తపించిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.    

అణుభయాన్ని ఛేదించి..

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని దేశం మొత్తం రగిలిపోయింది. అప్పటికే ఉరి ఘటన తరవాత భారత్‌ ఒకసారి మెరుపుదాడి చేసి ఉండటంతో మరోసారి ఆ అవకాశం ఇవ్వకూడదని పాక్‌ భావించి పీఓకేలోని ఉగ్రస్థావరాలను ఖాళీ చేసి బాలాకోట్‌లోని జైషే శిబిరానికి తరలించింది. అణుయుద్ధ భయంవల్ల తమ ప్రధాన భూభాగంలోకి భారత్‌ అడుగుపెట్టదనే భరోసాతో పాక్‌ ఉంది. కానీ, 1971 తరవాత తొలిసారి నిరుడు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్, మిరాజ్‌లు ఎయిర్‌బోర్న్‌ రాడార్ల సాయంతో బాలాకోట్‌ వైపు దూసుకెళ్లి, జైషే ఉగ్రశిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటన పాక్‌ పాలకుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తించింది. ఎన్ని ఉగ్రదాడులు చేసినా తమ అణుశక్తికి భయపడి భారత్‌ సరిహద్దు రేఖ దాటదన్న పాక్‌ భ్రమలు పటాపంచలయ్యాయి. అంతేకాదు, పాక్‌ ప్రజల ముందు ఆ దేశ రాజకీయ, సైనిక నాయకత్వం పరువుపోయింది. దీంతో మర్నాడు పాక్‌ యుద్ధ విమానాలు కృష్ణఘాటీ, నంగిటెక్రిలోని భారత సైనిక స్థావరాలను, నరియణ్‌లోని మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే అవి ప్రయోగించిన బాంబులు నిర్జన ప్రాంతాల్లో పడ్డాయి. ఈ క్రమంలో భారత గగనతల రక్షణ వ్యవస్థ సొంత ఎంఐ-17 హెలికాప్టర్‌ను పొరపాటున కూల్చేసింది. భారత వైమానిక దళానికి చెందిన మరో ‘పోరాట వాయు గస్తీ’ (సీఏపీ) బృందంలోని మిగ్‌-21, ఇతర యుద్ధవిమానాలు శత్రు లోహవిహంగాలతో తలపడ్డాయి. ఈ క్రమంలో పాక్‌కు చెందిన ఎఫ్‌-16ను కూల్చిన అనంతరం భారత్‌ మిగ్‌-21 నేలకూలింది. దాంతో అందులోని పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ శత్రు సైనికులకు పట్టుబడ్డాడు. తరవాత కొన్నిరోజులకే భారత్‌కు అప్పజెప్పారు. ఈ పరిణామాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందే నర్మగర్భంగా చెప్పడం- పాక్‌పై అంతర్జాతీయ ఒత్తిడి ఏ స్థాయిలో పనిచేసిందో స్పష్టీకరిస్తోంది. 

మన లోపాలూ కారణమే..!

ఈ మొత్తం వ్యవహారం భారత్‌ దళాల నిర్వహణ లోపాలను ఎత్తి చూపింది. ప్రభుత్వమూ వీటి దిద్దుబాటు చర్యలకు ప్రయత్నాలను వేగవంతం చేసింది. కశ్మీర్లో భారీ కాన్వాయ్‌ల్లో దళాల తరలింపులో ప్రభుత్వం మార్పులు చేసింది. అదే సమయంలో దళాల రాక సమయంలో రహదారులపై ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేసింది. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి ఇచ్చే ‘రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్‌ అలవెన్స్‌’ను పెంచింది. సిబ్బంది సెలవుపై వెళ్లేందుకు, వచ్చేటప్పుడు విమాన ప్రయాణానికి అనుమతించింది. సైనిక బృందాల  తరలింపులో వైమానిక దళాన్ని మరింత చురుగ్గా భాగస్వామిని చేయాలని నిర్ణయించింది.  మరోపక్క సంక్షోభ సమయంలో దళాల మధ్య సమన్వయ లోపాన్ని ఎంఐ హెలికాప్టర్‌ కూల్చివేత ఘటన తెలియజేస్తోంది. ఈ విషయంపై కొత్త వైమానిక దళపతి రాకేశ్‌కుమార్‌ బదౌరియా ఎటువంటి కప్పదాటు సమాధానాలు ఇవ్వకుండా అంగీకరించారు. దీంతోపాటు బాధ్యులపై చర్యలతోపాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో వైమానిక దళ ఆధునికీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాలం చెల్లిన మిగ్‌-21 విమానాల వయస్సుపై చర్చ మొదలైంది. అప్పటికే రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వివాదంలో మునిగిన రాజకీయ నేతలు ఈ అంశాన్ని ఎవరికి అనుకూలంగా వారు మలచుకొన్నారు. కానీ, నేటి వరకూ యుద్ధవిమానాల సంఖ్య పెంచేందుకు అవసరమైన కీలక నిర్ణయం మాత్రం వెలువడలేదు. ప్రస్తుతం వాయుసేన వద్ద దాదాపు ఆరు మిగ్‌-21, ఆరు జాగ్వార్, మూడు మిరాజ్‌ 2000, మూడు మిగ్‌ 29, పదకొండు సుఖోయ్‌ స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఇక మిగ్‌-27లకు గత డిసెంబర్‌లోనే విశ్రాంతినిచ్చారు. పడిపోతున్న విమానాల సంఖ్యను ఆధునిక విమానాలతో భర్తీచేసే చర్యలు ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి.  

చేతులెత్తేసిన డ్రాగన్‌..

పుల్వామా ఘటన సూత్రధారి జైషే అధినేత మసూద్‌ అజర్‌ను ఐరాస-1267 కమిటీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. చాలాకాలం అతణ్ని ఈ జాబితా నుంచి కాపాడిన చైనా, ఈసారి అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఫ్రాన్స్, అమెరికా, రష్యా, యూకే, జర్మనీలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. ఫలితంగా అంతర్జాతీయ ఆంక్షల చట్రంలోకి మసూద్‌ వచ్చినప్పటికీ నేటికీ పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. 

మాటల యుద్ధానికి మందు..

సంప్రదాయ యుద్ధంలో పాక్‌పై భారత్‌ది ఎప్పుడూ పైచేయే. బాలాకోట్‌ ఘటన తరవాతి పరిణామాల్లో సమాచార యుద్ధపరంగా పాక్‌ దూసుకెళ్లిందనే చెప్పాలి. తమ వారు ఎవరూ చనిపోలేదంటూనే 42రోజుల పాటు బాలాకోట్‌ శిబిరం ప్రాంతాల్లోకి ఎవరినీ రానీయలేదు. అందుకు తగిన సమాధానాలూ చెప్పలేదు. దాడుల పరంగా గురితప్పి భారత్‌ విఫలమైందంటూ బలమైన ప్రచారమే చేసింది. దీనికితోడు తమ ఎఫ్‌16 యుద్ధవిమానం కూలిపోలేదనీ చెప్పుకొంది. ‘ఫారిన్‌ పాలసీ’ వంటి అంతర్జాతీయ పత్రికలో వచ్చిన ఆధారరహిత కథనంతో ప్రపంచవ్యాప్తంగా పాక్‌ ఎఫ్‌16 కూలలేదనే ప్రచారం సాగించింది. ఆ మర్నాడు పెంటగాన్‌ దీన్ని తోసిపుచ్చినా అంత ప్రచారం రాలేదు. ఈ పరిణామాలు భారత్‌లో కొంత గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయి. ఎంతగా అంటే- భారత వాయుసేన సామర్థ్యాన్ని మన నాయకులే ఒక దశలో శంకించేంత వరకు వెళ్లింది. తప్పుడు సంకేతాలను పంపి, సైనిక దళాలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే పరిస్థితి ఇది. దీంతో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏడీజీపీఐకు అనుబంధంగా ‘ఇన్ఫర్మేషన్‌ వార్‌ఫేర్‌’ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.  


 

వేర్పాటు వాదానికి చెక్‌..

ఇక కశ్మీర్‌లో ఉగ్రవాదం ఏదో పుణ్యకార్యమైనట్లు అక్కడి వేర్పాటువాదులు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవడంలో స్థానిక రాజకీయ పార్టీలు నిర్లిప్తంగా వ్యవహరించాయి. దీనికితోడు దేశవ్యాప్తంగా అమలయ్యే కఠిన ఉగ్రచట్టాలు అక్కడ పనిచేయవు. దీంతో 2018లో పీడీపీ ఒత్తిడితో భారత సైన్యం కాల్పుల విరమణ పాటించిన సమయంలో ఉగ్రవాదులు మళ్లీ పుంజుకొన్నారు. శూజత్‌ బుకారీ వంటి మితవాద జర్నలిస్టు, భారత జవాను ఔరంగజేబును ఉగ్రమూక హత్య చేసింది. దీంతో కశ్మీర్లో అధికరణ 370 ఉన్నన్నాళ్లూ తలనొప్పులు తప్పవని ప్రభుత్వం గ్రహించింది. ముందుగా పీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి గవర్నర్‌ పాలన ప్రవేశపెట్టింది. ఆపై ఏడాదికి పుల్వామా దాడి జరగడం,  స్థానికుడే ఫిదాయిగా పనిచేయడం, ఘటనకు చాలా ముందుగానే పేలుడు పదార్థాలు, నిపుణులు పాక్‌ నుంచి రావడం, సిరియా, ఇరాక్‌ తరహాలో దాడి జరగడం- ప్రమాద ఘంటికలు మోగించాయి. ఇక ఉపేక్షించకూడదని భావించిన భాజపా, కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే కశ్మీర్‌లో అధికరణ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని విభజించింది. కేంద్ర ప్రభుత్వ చట్టాలను అక్కడ కూడా అమలులోకి తెచ్చింది. బలమైన కారణాలు చూపి అధికరణ 370 రద్దు చేయడానికి భాజపాకు అవకాశం లభించింది. దీంతో రద్దు నిర్ణయం వెలువడిన తరవాత దేశంలో ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. మరోపక్క చట్టవ్యతిరేక కార్యాకలాపాల నిరోధక బిల్లు 2019(సవరణ)కు ఆమోద ముద్రవేశారు. స్వచ్ఛంద ఉగ్రదాడులను(లోన్‌ ఉల్ఫ్‌ అటాక్‌) అడ్డుకోవడంలో ఈ చట్టం కీలకపాత్ర పోషించనుంది.   

   

మెతకవైఖరికి స్వస్తి..

పుల్వామా ఘటన తరవాత పాక్‌ విషయంలో భారత్‌ వైఖరిలో బలమైన మార్పు వచ్చింది. సరిహద్దు వాణిజ్యంపై ఆంక్షలు విధించింది. పాక్‌కు ఇచ్చిన ‘అత్యధిక ప్రాధాన్య దేశ’ హోదాను రద్దు చేసింది. తమతో వైరం పెట్టుకొంటే ఎటువంటి సాయం ఉండదనే బలమైన సంకేతాన్ని పాక్‌కు పంపింది. ముంబయి దాడుల తరవాత సరిహద్దులు దాటని ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’, ఉరి దాడి అనంతరం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై మెరుపు దాడుల రీతిలో, పుల్వమా ఘటనకు బదులు తీర్చుకోవడానికి ఏకంగా పాక్‌ ప్రధాన భూభాగంపైనే వైమానిక దాడులు జరిపింది. పాక్‌తో మెతక వైఖరికి భారత్‌ మెల్లిగా స్వస్తి చెబుతోందనడానికి ఇవి దాఖలాలు. అంతేకాదు, అణు భయం భారత్‌కే కాదు, తమకూ ఉండాలన్న చేదునిజం పాకిస్థాన్‌ గ్రహించేలా చేయడం భారత్‌ సాధించిన మరో నైతిక విజయం. పుల్వామా ఘటన తరవాత యావత్‌ భారత దేశం ఒక్కతాటిపైకి రాగా, మరోవైపు పాకిస్థాన్‌ అదే ఉగ్రవాద కోరలకు చిక్కి విలవిల్లాడుతోంది. అభివృద్ధి కుంటువడి, ఆర్థికంగా సతమతమైపోతూ అప్పుకూడా పుట్టని పరిస్థితుల్లో దిక్కులేని స్థితిలో కూరుకుపోయింది. మరోవైపు క్లిష్ట సమయంలో భారత్‌ ప్రదర్శించిన సంయమనం అంతర్జాతీయంగానూ ప్రశంసలను అందుకొంది. ఉగ్రవాద వ్యతిరేక పోరులో ప్రపంచ దేశాలు కలిసికట్టుగా నిలబడటానికి పుల్వామా ఘటనను తిరుగులేని ఆయుధంగా ఉపయోగించడం- భారత్‌ సాధించిన మరో ప్రపంచ దౌత్య విజయం!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.